హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎంఎంసీలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయనున్నట్లు ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం తార్నాకలోని ఆఫీసులో జోనల్ కమిషనర్లు, చీఫ్ సిటీ ప్లానర్, ఇంజినీరింగ్, భూసేకరణ అధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఓసీ సెంటర్ ప్రాజెక్టుకు సంబంధించి రక్షణ శాఖ భూమికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5.78 ఎకరాల భూమి కేటాయింపు, శామీర్‌పేట్‌లోని ఎల్‌ఎల్‌ఆర్ ప్రాంతంలో 153 ఎకరాల భూమి బదిలీ అంశాలపై చర్చించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేలా మేడ్చల్–మల్కాజ్‌గిరి కలెక్టర్‌కు లెటర్రాయాలని అధికారులను ఆదేశించారు.
పనులు ప్రారంభించేందుకు అవసరమైన రైల్వే భూముల సేకరణపైనా సమీక్షించారు. టీకేఆర్ ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల ప్రభావితమయ్యే ఆస్తుల గురించి చర్చించిన కమిషనర్ నష్టం తక్కువగా ఉండేలా ప్రత్యామ్నాయ మార్గాన్ని పరిశీలించాలన్నారు. కాగా, ఈ మీటింగుకు హాజరైన బాధితుల్లో పలువురు టీడీఆర్ తీసుకునేందుకు అంగీకరించారు. ఆర్‌కే పురం ఆర్‌ఓబీ నిర్మాణం వల్ల ఆస్తులు కోల్పోతున్న 34 మంది టీడీఆర్ తీసుకునేందుకు ముందుకు వచ్చారు. ఉప్పల్ ఫ్లైఓవర్‌కు సంబంధించి మిగిలిపోయిన ఫౌండేషన్ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. రామంతాపూర్ వైపు ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమైన సర్వే ఆఫ్ ఇండియా భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, దీనిపై ఉప్పల్ జోనల్ కమిషనర్ నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
