పిల్లలు ఫోన్ వదలడం లేదండీ..! ఇప్పుడు ప్రతి ఇంట్లో ఇదే కంప్లైంట్. ఫోన్ లేకుంటే అన్నం కూడా తినలేనంతగా అడిక్ట్ అయిపోయారు కొంతమంది పిల్లలు.మొదట్లో అల్లరి మాన్పించడం కోసం తల్లిందండ్రులు చేసిన అలవాటు ఇప్పుడు పిల్లల పాలిట శాపంగా మారింది. ఫోన్ కి అలవాటైన పిల్లల్లో ఏకాగ్రత లోపించడం, హైపర్ యాక్టివ్ నెస్ వల్ల పేరెంట్స్ నరకయాతన పడుతున్నారు. ఈ క్రమంలో ఓ స్కూల్లో టీచర్లు పిల్లల్లో ఫోన్ పిచ్చి తగ్గించేలా సూపర్ ప్లాన్ వేశారు. ఈ ప్లాన్ తో పిల్లలు ఫోన్ ముట్టుకోవాలంటే కూడా వణికిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
కీర్తన్ అనే నర్సరీ స్కూల్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పిల్లల్లో ఫోన్ అడిక్షన్ తగ్గించేందుకు టీచర్లు ఓ స్కిట్ ప్లాన్ చేశారు. ఈ స్కిట్ లో ఒక టీచర్ చిన్నారి పాత్రలో నటించగా.. ఒక టీచర్ తల్లి పాత్ర, మరో టీచర్ డాక్టర్ పాత్రలో నటించారు.
చిన్నారి తిండి తిప్పలు కూడా మానేసి ఫోన్ చూస్తూనే ఉంటుంది... తల్లి టిఫిన్ చేయమని చెప్పినా, బుక్స్ ఇచ్చి చదువుకొమ్మని చెప్పినా వినకుండా ఫోన్ చూస్తూనే ఉంటుంది చిన్నారి. దీంతో ఒకరోజు చిన్నారికి కళ్ళు మంటలు మొదలవడంతో ఆసుపత్రికి తీసుకెళ్తుంది తల్లి. చిన్నారిని పరీక్షించిన డాక్టర్ ఆమె కళ్ళు దెబ్బతిన్నాయని చెప్పి.. ఆపరేషన్ చేసి కళ్ళకు గంతలు కడతారు. అంతే... ఈ స్కిట్ చుసిన పిల్లలు ఫోన్ ముట్టుకోవాలంటేనే వణికిపోయారు. టీచర్ వెళ్లి చేతికి ఫోన్ ఇస్తుంటే వద్దంటూ... భయంతో ఏడవడం స్టార్ట్ చేశారు పిల్లలు.
ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో రకరకాల కామెంట్స్ తో రియాక్ట్ అవుతున్నారు నెటిజన్స్. పిల్లల చేత ఫోన్ అలవాటు మాన్పించేందుకు బెస్ట్ ఐడియా ఇదేనని... ఒక్క దెబ్బతో ఫోన్ ముట్టుకోవాలంటేనే వణికిపోతున్నారంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.
అయితే... చిన్న వయసులో ఇంతలా భయపెడితే భవిష్యత్తులో ఫోన్ చూస్తేనే భయపడతారని... వాళ్ళ ఎదుగుదలకు ఇది అడ్డంకిగా మారుతుందని అంటున్నారు మరికొంతమంది నెటిజన్స్.
