
రంగారెడ్డి: కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయనేది అనుమానం మాత్రమేనని.. బిల్లులు ఏం ఎక్కువ రాలేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఓ మొబైల్ షాప్‌కు ఊహించని రేంజ్ లో బిల్లు వచ్చింది. వచ్చిన బిల్లును చూసి షాప్ ఓనరకు దిమ్మ దిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్ పట్టణంలోని కాలేజ్ రోడ్డులోని చిన్న మొబైల్ షాప్ లో లాక్ డౌన్ 3 నెలలకు గాను ఆ షాప్ కు రూ. 12,04,738 (అక్షరాలా పన్నెండు లక్షల నాలుగు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది రూపాయలు) బిల్లు వచ్చింది. షాప్ ఓనర్.., ఇది మొత్తం షాద్ నగర్ నియోజకవర్గం బిల్లా లేక షాప్ దా అని అవాక్కయ్యాడు. ప్రతి నెల 300 నుండి 500 బిల్లు వచ్చే తనకు ఇంత మొత్తం బిల్లు తన ఆస్తులు అమ్మినా కట్టలేనని అంటున్నాడు. స్థానిక విద్యుత్ అధికారిని వివరం అడగగా మీటర్ లో సాంకేతిక లోపం వల్లే ఇంత బిల్లు వచ్చిందని ఆ షాప్ కి 1000 రూపాయలు మాత్రమే బిల్లు వచ్చిందని అంటున్నారు. మిగతా వారికి మాత్రం బిల్లులు అన్ని సరిగ్గానే వచ్చాయని తెలిపారు.