సెక్యూరిటీ గార్డులే దొంగలు

సెక్యూరిటీ గార్డులే దొంగలు

ఈ నెల 12న కొంపల్లిలోని ప్రో కనెక్ట్ వేర్ హౌజ్ లో అమెజాన్ స్టోర్స్ లో ఆన్ లైన్ ఆర్డర్ కి చెందిన సెల్ ఫోన్ల చోరీకి పాల్పడ్డ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తూ స్మార్ట్ ఫోన్లను దొంగిలించిన ఐదుగురు సభ్యుల అసోం ముఠాను నుంచి రూ 8.05లక్షల విలువ చేసే 61 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగల ముఠా గురించి సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపిన వివరాల ప్రకారం…అసోం రాష్ట్రానికి చెందిన సిరాజుద్దీన్ (25) రఫిక్ హుస్సే న్(48) రెండేళ్లుగా కొంపల్లి, మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. ఈ ఇద్దరు కొంపల్లిలో శ్రీనాథ్ రెడ్డి అనే మొబైల్ వ్యాపారికి చెందిన ప్రోకనెక్ట్ వేర్ హౌజ్ వద్ద సెక్యూరిటీగా పనిచేస్తున్నారు. ఇందులో అమెజాన్ ఆన్ లైన్ ఈకామర్స్ కి సంబంధించిన మొబైల్ స్టోర్ కూడా ఉంది. అయితే ప్రతీ రోజు అక్కడే డ్యూటీ చేసే సిరాజుద్దీన్,రఫిక్ హుస్సేన్ అమెజాన్ స్టోర్స్ వద్ద సెక్యూరిటీ తక్కువగా ఉండడం గమనించారు. ఎలాగైనా స్మార్ట్ ఫోన్లను దొంగిలించాలని ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని అసోం రాష్ట్రం లోని తమ గ్రామానికే చెందిన కొంపల్లిలోని జయదర్శిని ఎన్ క్లేవ్ లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సంజయ్ కుమార్ నాథా(34)కి చెప్పారు. తర్వాత సిరాజుద్దీన్, రఫిక్ హుస్సేన్ అసోం రాష్ట్రంలోని తమ గ్రామానికి చెందిన ముకిబర్ రెహమాన్(20),అబ్ధుల్ మాలిక్(20),సంతు హకి, ఆరిఫ్ అలీని చోరీ కోసం సిటీకి రప్పించారు. తాము సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న కొంపల్లి లోని అమెజాన్ స్టోర్స్ నుంచి విలువైన స్మార్ట్ ఫోన్లు దొంగిలించాలని సిరాజుద్దీన్, రఫిక్ హుస్సేన్ తమ గ్రామానికి చెందిన ఈ నలుగురితో వారితో కలిసి స్కెచ్ వేశారు.

పక్కా ప్లాన్ తో..
ఈ ఆరుగురు సభ్యుల ముఠా సెల్ ఫోన్ల దోపిడీకి ప్లాన్ చేసింది. తమ ప్లాన్ లో భాగంగా ఈ నెల 12న అర్ధరాత్రి సిరాజుద్దీన్ పనిచేస్తున్న ప్రోకనెక్ట్ వేర్ హౌజ్ కి వచ్చారు. ముకిబర్ రెహమాన్,సంతు హకీ ప్రో కనెక్ట్ హౌజ్ షెట్టర్ ను లిఫ్ట్ చేశారు. అబ్ధుల్ మాలిక్, ఆరిఫ్ లు వేర్ హౌజ్ లోపలికి వెళ్ళారు. సిరాజుద్దీన్ చెప్పినట్లుగా అక్కడ ఉన్న సీసీ కెమెరాలకు చిక్కినా గుర్తించకుండా ఉండేందుకు ముఖాలను మాస్కులు వేసుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా అక్కడ సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ చేస్తున్న సిరాజుద్దీన్,రఫిక్ హుస్సే న్ ప్రోకనెక్ట్ వేర్ పరిసర ప్రాంతాల్లో నిఘా పెట్టారు. దీంతో తాము స్కెచ్ వేసిన విధంగా ప్రో కనెక్ట్ వేర్ హౌజ్ లోని అమెజాన్ ఆన్ లైన్ ఆర్డర్ కి చెందిన 120 స్మార్ట్ ఫోన్లను వారు దొంగిలించారు. ఆ తరువాత డైరెక్ట్ గా సిరాజుద్దీన్ రూమ్ కి వెళ్లారు. అప్పటికే ఆన్ లైన్ ఆర్డర్ సప్లయ్ కోసం ప్యాక్ చేసి ఉన్న అమెజాన్ కవర్స్ ను తొలగించారు. వాటిని పూర్తిగా తగులపెట్టారు. ఈ దొంగతనం ప్లాన్ గురించి అప్పటికే తెలిసిన జయదర్శిని ఎన్ క్లేవ్ లో పనిచేసే సెక్యూరిటీ గార్డు సంజయ్ కుమార్ ఆ రోజు రాత్రి సిరాజుద్దీన్ రూమ్ కి వచ్చాడు . దొంగిలించిన ఫోన్లలో 5 స్మార్ట్ ఫోన్లను సంజయ్ కుమార్ కి ఇచ్చి సిరాజుద్దీన్ అసోం పారిపోయాడు. తర్వాత ఈ చోరీ చేసిన ముకిబర్ రెహమాన్,సంతు హకీ,ఆరిఫ్ అలీ కూడా ట్రెయిన్ లో అసోం వెళ్ళారు. తమపై అనుమానం రాకుండా ఉండేందుకు మాలిక్, రఫిక్ హుస్సే న్ కొంపల్లిలోనే ఉంటూ.. తమ దగ్గరు ఉన్న మరికొన్ని సెల్ ఫోన్లను అమ్మి వాటాలు పంచుకున్నారు.

ఇలా దొరికారు..

ప్రో కనెక్ట్ వేర్ హౌజ్ లో రూ.15.89లక్షల విలువ చేసే 120 స్మార్ట్ ఫోన్లు దోపీడీకి గురయ్యాయని ఈ నెల 13న ఓనర్ శ్రీనాథ్ రెడ్డి పేట్ బషీర్ బాద్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్పెషల్ టీమ్స్ గా ఏర్పడ్డారు. మొదటగా సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేశారు. తర్వాత అక్కడ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సిరాజుద్దీన్ డ్యూటీకి రాకపోవడంతో పోలీసులకు వారిపై అనుమానం వచ్చి ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. శ్రీనాథ్ రెడ్డి ఇచ్చిన సమాచారంతో సిరాజుద్దీన్ అసోంకి చెందిన వాడిగా గుర్తించిన పోలీసులు అతడి కోసం బాలానగర్ ఎస్ వోటీ పోలీసులు హైదరాబాద్ తో పాటు అసోం, వెస్ట్ బెంగాల్ లో గాలించారు. ప్రధాన నిందితుడైన సిరాజుద్దీన్, రెహమాన్ ను అసోంలో గురువారం పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి ట్రాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్ తరలించారు. సిరాజుద్దీన్ ని విచారించగా..అతడిచ్చిన సమాచారంతో ఈ చోరీలో భాగస్వాములైన అబ్దుల్ మాలిక్, రఫిక్ హుస్సే న్, సంజయ్ కుమార్ ను మేడ్చల్, కొంపల్లిలో అరెస్టు చేశారు. వీరి దగ్గరి నుంచి రూ.8.05 లక్షల విలువ చేసే స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితులు ఆరిఫ్ అలీ, సంతు హక్ కోసం గాలిస్తున్నట్టు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. సెక్యూరిటీ గార్డులను నియమించుకునే సమయంలో పూర్తి వివరాలను తెలుసుకోవాలని సూచించారు. అనుతులున్న ఏజెన్సీల నుంచి మాత్రమే గార్డులను తీసుకోవాలని చెప్పారు.