ఏడేళ్లుగా పూర్తికాని మోడల్‌ స్కూల్‌ హాస్టల్‌ బిల్డింగ్‌

ఏడేళ్లుగా పూర్తికాని మోడల్‌ స్కూల్‌ హాస్టల్‌ బిల్డింగ్‌
  • ఏడు నెలలుగా సాగుతున్న పీహెచ్‌సీ సబ్‌ సెంటర్‌

మహాముత్తారం, వెలుగు : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం దొబ్బలపహాడ్‌ మోడల్‌ స్కూల్‌ హాస్టల్‌ బిల్డింగ్‌ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఆఫీసర్ల అలసత్వం.. కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం కారణంగా పనులు ముందుకు సాగడం లేదు. మోడల్‌ స్కూల్‌ హాస్టల్‌ బిల్డింగ్‌ నిర్మాణం కోసం ప్రభుత్వం రాజీవ్‌ విద్యామిషన్‌ నుంచి రూ. 1.28 కోట్లు మంజూరు చేసింది. పనులకు 2016 ఏప్రిల్‌ 9న అప్పటి మంథని ఎమ్మెల్యే పుట్ట మధు శంకుస్థాపన చేశారు. ఏడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పనులు కాలేదు. దీంతో స్టూడెంట్లు 15 నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణించి స్కూల్‌కు వస్తున్నారు. టైంకు ఆర్టీసీ బస్సులు రాక ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించడంతో ఒక్కో స్టూడెంట్‌ రూ. 1000 నుంచి రూ. 1500 ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో తమపై భారం పడుతోందని స్టూడెంట్లు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ఆఫీసర్లు స్పందించి హాస్టల్‌ బిల్డింగ్‌ కంప్లీట్‌ అయ్యేలా చూడాలని కోరుతున్నారు.

నత్తనడకన పీహెచ్‌సీ సబ్‌సెంటర్‌

స్టేషన్‌ఘన్‌పూర్‌, వెలుగు : జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎస్సీ కాలనీలో నిర్మిస్తున్న పీహెచ్‌సీ సబ్‌సెంటర్‌ నిర్మాణ పనులు నెలలు గడుస్తున్నా మందుకు సాగడం లేదు. కాలనీలో సబ్‌సెంటర్‌ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 20 లక్షలు మంజూరు చేసింది. 7 నెలల కింద ఎమ్మెల్యే రాజయ్య శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో సబ్‌సెంటర్‌ పనులు బేస్‌మెంట్‌ స్థాయిలోనే ఆగిపోయాయి. సబ్‌ సెంటర్‌ ప్రస్తుతం అద్దె భవనంలో నడుస్తుండడంతో సౌకర్యాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసర్లు స్పందించి సబ్‌ సెంటర్‌ నిర్మాణ పనులుత్వరగా పూర్తయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.