న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఒకవైపు ‘విశ్వగురువు’గా చెప్పుకుంటూ, మరోవైపు దేశంలో ఒక్క పరీక్షను కూడా సరిగ్గా నిర్వహించలేకపోతున్నారని మండిపడ్డారు.
దేశవ్యాప్తంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం శనివారం నిర్వహించిన సీయూఈటీయూజీ 2026 పరీక్ష కొన్ని కేంద్రాల్లో సాంకేతిక లోపాల కారణంగా ఆలస్యమైందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘నీట్, సీబీఎస్‌ఈ, ఎస్‌ఎస్‌సీ, నేడు సీయూఈటీ.. నాలుగు పరీక్షలు.. ఒక కోటి మంది విద్యార్థులు... వీటిలో ఏ ఒక్క పరీక్షను కూడా ప్రభుత్వం నిజాయితీగా, సక్రమంగా నిర్వహించలేకపోయింది’’ అని రాహుల్ శనివారం ‘ఎక్స్’లో ఆరోపించారు.
దేశాన్ని ‘విశ్వగురువు’గా చాటుకుంటున్నారు కానీ, కనీసం ఒక్క పరీక్షను కూడా సరిగ్గా జరపలేకపోతున్నారు. దేశంలోని మొత్తం విద్యా వ్యవస్థను మోదీ చేతులారా నాశనం చేశారు. ఏ యువత భవిష్యత్తును అయితే మీరు పాడు చేస్తున్నారో, అదే తరం రేపు మిమ్మల్ని నిలదీస్తుంది. జవాబుదారీగా నిలబెడుతుంది” అని హెచ్చరించారు.
