- కేందింపుద్ర ప్రభుత్వం పొదుపు మంత్రం
- పశ్చిమాసియా సంక్షోభంతో ముందస్తు చర్యలు
- ప్రధాని కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్య 50 శాతానికి కుదింపు
- ప్రధాని బాటలోనే బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు
- బంగారం, వెండి దిగుమతులపై దిగుమతి సుంకం భారీగా పెంపు
- 6 శాతం నుంచి ఏకంగా 15 శాతానికి హైక్
కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు మరింత ప్రాధాన్యం రూ. 37,500 కోట్ల ప్రోత్సాహకాలు.. కేంద్ర కేబినెట్ ఆమోదం బొగ్గును గ్యాస్‌గా మార్చి వాడటం ద్వారా ఎల్ఎన్జీ, యూరియా, అమ్మోనియా, మిథనాల్ దిగుమతులు తగ్గించే యోచనఖర్చులు తగ్గించుకోవాలని ఇతర శాఖలకు కేంద్రం సూచన
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం, ఇంధన కొరత, ధరల పెరుగుదల భయాలు, విదేశీ మారకద్రవ్య నిల్వలపై ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పొదుపు చర్యలు ప్రారంభించింది. ప్రధాన మంత్రితోపాటు కేంద్ర మంత్రుల కాన్వాయ్‌లను సగానికి సగం కుదించాలని, కాన్వాయ్‌లలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. క్రూడ్ ఆయిల్ ధరల ముప్పు పెరుగుతున్న తరుణంలో ప్రయాణాలు, ఇంధన వినియోగం, ఆడంబరపు ఖర్చులను తగ్గించుకోవాలని కేంద్ర మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. బంగారం, వెండి దిగుమతులపై ఇంపోర్ట్ డ్యూటీని భారీగా పెంచింది. అదేవిధంగా బొగ్గును గ్యాస్‌గా మార్చి వినియోగించేందుకు వీలుగా కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా సంక్షోభం వల్ల హార్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు ఆగిపోయి, సప్లయ్ చైన్ దెబ్బతినడంతో భారత్‌తోపాటు ప్రపంచ దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి నిత్యావసరాల ధరలూ నింగినంటే ప్రమాదం ముంచుకొస్తోంది. ఈ నేపథ్యంలో గండం నుంచి గట్టెక్కాలంటే దేశీయంగా పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సభలో పిలుపునిచ్చారు. బంగారం కొనుగోలు చేయొద్దని, పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగం తగ్గించాలని, వీలైతే వర్క్ ఫ్రం హోం చేయాలని కోరారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచే ఈ మేరకు పొదుపు చర్యలను మొదలుపెట్టారు. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఏపీ సీఎం
చంద్రబాబు నాయుడు, ఇతర రాష్ట్రాల నేతలు సైతం పొదుపు చర్యలు చేపడుతున్నట్టు ప్రకటించారు.
ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా పొదుపును ప్రోత్సహించడానికి, ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించాలని, ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచాలని ప్రధాని మోదీ ఆదేశించారు. అయితే, ఇందుకోసం కొత్త వాహనాలను కొనుగోలు చేయవద్దని స్పష్టం చేశారు. ప్రధాని ఆదేశాల మేరకు 'బ్లూ బుక్'లో పేర్కొన్న తప్పనిసరి భద్రతా మార్గదర్శకాల విషయంలో రాజీ పడకుండానే ఎస్పీజీ పొదుపు చర్యలను ప్రారంభించింది. దిగుమతులపై వ్యయాన్ని తగ్గించడానికి తగిన చర్యలు సూచిస్తూ ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సభలో మోదీ ప్రసంగించిన వెంటనే గుజరాత్, అస్సాం పర్యటనల్లో ఆయన కాన్వాయ్ పరిమాణాన్ని తగ్గించారు.
మినిస్ట్రీలకూ పొదుపు ఆదేశాలు అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, పశ్చిమాసియా సంక్షోభంతో ఏర్పడుతున్న ఆర్థిక ప్రభావాల దృష్ట్యా.. ఇంధన వినియోగాన్ని హేతుబద్ధీకరించడం, అధికారిక ప్రయాణాలను పరిమితం చేయడం, వేడుకల ఖర్చులను తగ్గించడం, ప్రభుత్వ కార్యక్రమాలను వీలైనంత వరకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా నిర్వహించడం ద్వారా పరిపాలనాపరమైన వ్యయాన్ని గణనీయంగా తగ్గించాలని కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలకు ఆదేశాలందాయి. ఈ నిబంధనలు మంత్రులకు, అధికారులకు కూడా వర్తించనున్నాయి. పొదుపు చర్యలపై మంత్రిత్వ శాఖల నుంచి త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ ఇతర కేంద్ర మంత్రులు కూడా తమ కాన్వాయ్‌లను తగ్గించుకుని, అనవసర ప్రయాణాలను నియంత్రించుకుంటున్నారు.
మోదీ బాటలో బీజేపీ సీఎంలు, ఇతర నేతలు ప్రధాని పిలుపు మేరకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తమ కాన్వాయ్‌లోని వెహికల్స్‌ను తగ్గించాలని ఆదేశించారు. ప్రజలు కూడా ప్రధాని పిలుపును పాటించాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల అధికారిక వాహనాలపై పరిమితులు విధించారు. ప్రజలు ప్రైవేట్ వాహనాలకు బదులుగా కార్‌పూలింగ్, బస్సులు, మెట్రో సేవలను ఉపయోగించాలని కోరారు. మంత్రులు అధికారిక ప్రయాణాల కోసం విమానాలను ఉపయోగించే ముందు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. హెలికాప్టర్లు, విమానాలకు బదులుగా రైళ్లు, స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ బస్సులు, ప్రజా రవాణా ద్వారా రాష్ట్రంలో పర్యటిస్తానని గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రకటించారు. గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. చత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయ్ తన కాన్వాయ్ పరిమాణాన్ని తగ్గించడమే కాకుండా, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. హిమాచల్ గవర్నర్ కవిందర్ గుప్తా లోక్ భవన్‌ను 'ఫ్యూయెల్ కన్జర్వేషన్ జోన్'గా ప్రకటించారు. తన కాన్వాయ్‌ను సగానికి తగ్గించడమే కాకుండా, పశ్చిమ ఆసియా సంక్షోభం సద్దుమణిగే వరకు ఆదివారం నాటి అధికారిక కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించాలని, ప్రభుత్వ హెలికాప్టర్‌ను వాడకూడదని నిర్ణయించుకున్నారు.
బంగారం, వెండి దిగుమతులపై పెరిగిన పన్నులు రూపాయిపై ఒత్తిడి తగ్గించేందుకు, ఫారెక్స్ నిల్వలను కాపాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతులపై భారీగా సుంకాలను వేసింది. వీటిపై దిగుమతి సుంకాన్ని ప్రస్తుతం ఉన్న 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. ఈ నిర్ణయం బుధవారం నుంచే అమల్లోకి వచ్చింది. గోల్డ్ కొనుగోళ్లను కనీసం ఏడాదిపాటు వాయిదా వేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన కొన్ని రోజులకే టారిఫ్ పెంపు ప్రకటన వచ్చింది. ప్లాటినమ్ దిగుమతులపై సుంకం 6.4 శాతం నుంచి 15.4శాతానికి పెరిగింది. దిగుమతి సుంకాలను పెంచడంలో భాగంగా బంగారం, వెండిపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 10 శాతానికి పెంచారు. అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్ (ఏఐడీసీ) ని ఒక శాతం నుంచి 5 శాతానికి పెంచారు. దీనికి 3 శాతం ఐజీఎస్‌టీ అదనం. మొత్తంగా బంగారం, వెండి దిగుమతులపై విధించే పన్ను 9.18 శాతం నుంచి 18.45 శాతానికి చేరుకుంది. కాగా, 2025–-26లో 102.5 బిలియన్ డాలర్ల విలువైన బంగారం, వెండిని దిగుమతి చేసుకున్నాం.
ఇది ఏడాది లెక్కన 26.7 శాతం పెరుగుదల. మొత్తం ఇండియా దిగుమతుల్లో వీటి వాటా 2024-–25లో 11.8 శాతం ఉంటే, 2025–-26లో 14 శాతానికి చేరింది.భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు కేంద్ర ప్రభుత్వం విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని15 శాతానికి పెంచడంతో బుధవారం స్థానిక మార్కెట్లో బంగారం ధరలు రూ. 8,550 పెరిగి, 10 గ్రాముల బంగారం రూ. 1.65 లక్షల మార్కును దాటింది. ఢిల్లీ మార్కెట్లలో వెండి ధర కిలోకు రూ. 20,500 పెరిగి రూ. 2,97,500కి చేరింది. క్రితం రోజు అన్ని పన్నులతో కలిపి వెండి ధర రూ. 2,77,000 వద్ద ఉంది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర 5 శాతానికి పైగా (రూ. 8,550) పెరిగింది. క్రితం రోజు రూ. 1,56,800 వద్ద ఉన్న 10 గ్రాముల బంగారం ధర, ఇప్పుడు అన్ని పన్నులతో కలిపి రూ. 1,65,350కి చేరుకుంది. ఇక హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర బుధవారం రూ.8 వేలు పెరిగి రూ.1.62 లక్షలకు చేరింది. వెండి కేజీ ధర రూ.20 వేలు పెరిగి రూ.3.20 లక్షలకు ఎగిసింది.
కోల్ గ్యాసిఫికేషన్ కు రూ. 37,500 కోట్లు పర్యావరణ హిత క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంచడానికి, విదేశీ మారక ద్రవ్యాన్ని భారీగా ఖర్చు చేసే ఎల్ఎన్జీ, యూరియా, మిథనాల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, అలాగే ప్రపంచ ధరల అస్థిరత, సప్లయ్ చైన్ అంతరాయాల నుంచి దేశాన్ని రక్షించడానికి గాను కోల్ గ్యాసిఫికేషన్ ప్రోత్సాహక పథకానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ పథకం కింద ఉపరితల బొగ్గు/లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. "కోల్ గ్యాసిఫికేషన్ పథకం కోసం రూ. 37,500 కోట్ల నిధులను కేటాయించాం. దీని ద్వారా సుమారు రూ. 3,000 లక్షల కోట్ల పెట్టుబడులు, ఏటా రూ. 6,300 కోట్ల ఆదాయం వస్తాయి. 75 మిలియన్ టన్నుల బొగ్గును గ్యాసిఫై చేయడానికి ఈ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తారు" అని కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా సమావేశంలో తెలిపారు. దేశంలో 401 మిలియన్ టన్నుల కోల్ రిజర్వ్ లు, 47 బిలియన్ టన్నుల లిగ్నైట్ నిల్వలు ఉన్నాయని, ఇవి రాబోయే 200 ఏళ్లకు సరిపోతాయని ఆయన చెప్పారు.
‘‘ప్రస్తుతం 50 శాతం కంటే ఎక్కువ ఎల్ఎన్జీ దిగుమతి అవుతుండగా, ఇకపై అది తగ్గుతుంది. దిగుమతి చేసుకోవాల్సిన యూరియాను కూడా దేశంలోనే తయారు చేయడం ప్రారంభిస్తాం. అమ్మోనియా ప్రస్తుతం100 శాతం దిగుమతి అవుతోంది. ఈ పథకంతో అమ్మోనియా ఉత్పత్తికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. మిథనాల్ ప్రస్తుతం 80- నుంచి 90 శాతం దిగుమతి అవుతోంది, అది కూడా ఇకపై భారత్‌లోనే తయారవుతుంది" అని వైష్ణవ్ పేర్కొన్నారు. కాగా, ఈ ప్రోత్సాహకం నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ మిషన్ (2021)పై ఆధారపడి ఉంటుంది. జనవరి 2024లో ఆమోదించిన రూ. 8,500 కోట్ల పథకం కింద ప్రస్తుతం రూ. 6,233 కోట్ల విలువైన 8 ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి.
రెండు కార్లతోనే మోదీ కాన్వాయ్!
ప్రధాని మోదీ కేవలం రెండు కార్లతో కూడిన కాన్వాయ్‌లోనే ప్రయాణించారంటూ సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. మంత్రులు, నేతలు తమ కాన్వాయ్‌లలో వెహికల్స్ సంఖ్యను సగం తగ్గించుకోవాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఢిల్లీలో ప్రధాని ప్రయాణించిన కాన్వాయ్‌లో రెండు కార్లు (రేంజ్ రోవర్, ఫార్చూనర్) మాత్రమే వినియోగించారంటూ వార్తలు వచ్చాయి.
కోల్ గ్యాసిఫికేషన్ అంటే..?
బొగ్గును నేరుగా మండించకుండా, దానిని ఒక వాయువుగా (గ్యాస్‌గా) మార్చే ప్రక్రియనే కోల్ గ్యాసిఫికేషన్ అంటారు. సాధారణంగా మనం బొగ్గును మండిస్తే మంట, వేడి, పొగ వస్తాయి. కానీ గ్యాసిఫికేషన్ ప్రక్రియలో బొగ్గును పూర్తిగా మండించరు. తక్కువ పరిమాణంలో ఆక్సిజన్, ఆవిరిని ఉపయోగించి బొగ్గును అత్యధిక ఉష్ణోగ్రత వద్ద రసాయన చర్యకు గురి చేస్తారు. ఈ ప్రక్రియ వల్ల బొగ్గు 'సిన్ గ్యాస్(సింథటిక్ గ్యాస్)' అనే వాయువుగా మారుతుంది. ఈ వాయువులో ప్రధానంగా హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్, తక్కువ మొత్తంలో మీథేన్ ఉంటా యి. దీనివల్ల అనేక లాభాలు ఉన్నాయి. బొగ్గును మండించడానికి బదులు గ్యాస్‌గా మార్చి వాడ టం వల్ల పర్యావరణానికి తక్కువ హాని జరుగు తుంది. సల్ఫర్, నైట్రోజన్ వంటి కలుషితాలను ఈ ప్రక్రియలోనే వేరు చేయవచ్చు. సిన్ గ్యాస్ నుంచి యూరియా, రసాయన పరిశ్రమల్లో వాడే మిథనాల్, స్వచ్ఛమైన హైడ్రోజన్ ఇంధనాన్ని తయారు చేయవచ్చు. ఈ వాయువును ఉపయో గించి గ్యాస్ టర్బైన్ల ద్వారా విద్యుత్తును కూడా ఉత్పత్తి చేయవచ్చు. ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఎల్ఎన్జీ, యూరియా వంటి వాటిని మన దేశంలో ఉన్న బొగ్గు నిల్వల తోనే తయారు చేసుకోవచ్చు. దీనివల్ల దేశ సంపద గణనీయంగా ఆదా అవుతుంది. మన దేశంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. పెట్రోల్, గ్యాస్ వంటి వాటి కోసం మనం ఇతర దేశాలపై ఆధారపడుతున్నాం. బొగ్గును గ్యాస్‌గా మార్చే టెక్నాలజీని వాడితే, మన దగ్గర ఉన్న బొగ్గుతోనే రసాయనాలు, ఇంధనం తయారు చేసుకుని 'ఆత్మనిర్భర్(స్వయం సమృద్ధ)భారత్' దిశగా అడుగులు వేయవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
