
- ఉచితంగా బియ్యం, సిలిండర్లు అందించారు
- జన్ ధన్ ఖాతాల్లో సొమ్ము జమ చేశారని వెల్లడి
- లాక్ డౌన్ రూల్స పాటించి ప్రభుత్వానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి
కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన ప్రధాని మోడీ.. పేద జనం ఆకలితో ఇబ్బంది పడొద్దని గరీబ్ కల్యాణ్ యోజనను ప్రకటించారని మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి అన్నారు. పేదల కోసం రూ.లక్షా 70వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించారని, నిర్ణీత సమయానికి వారికి అందేలా చర్యలు చేపట్టారని చెప్పారు. దీనిపై ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని పేర్కొన్నారు.
ఉచితంగా బియ్యమిచ్చారు
పేద జనం ఆకలితో అలమటించ వద్దని ప్రధాని మోడీ ఉచితంగా బియ్యం, గోధుమలు అందించారని.. జన్ధన్ ఖాతాలున్న మహిళలకు రూ.500 చొప్పున బ్యాంకులో జమ చేశారని వివేక్ చెప్పారు. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లో ఉండిపోయిన వలస కూలీలకు 12 కిలోల చొప్పున బియ్యం అందించడం, ఐదేండ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరికి రూ.500 చొప్పున ఇవ్వడం ప్రధాన మంత్రి చొరవతోనే జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలకు సైతం ప్రధాన మంత్రి ఉజ్వల పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందుతున్నాయని తెలిపారు. లాక్ డౌన్ సమయంలో పేదలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చేసిన ప్రధాని మోడీకి దేశ ప్రజల తరఫున, తన తరఫున కృతజ్ఞతలు చెప్తున్నానని తెలిపారు. ప్రజలెవరూ లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘించవద్దని, ఇండ్లలోనే ఉండి ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.