
- కవిత అరెస్ట్ పై మోదీ, కేసీఆర్ కొత్త డ్రామా: రేవంత్ రెడ్డి
- గ్రూప్1 నిర్వహణలో ఫెయిలైన కేసీఆర్ రాజీనామా చేయాలి
- తెలంగాణ ఎమర్జెన్సీలో మగ్గుతోందని కామెంట్
న్యూఢిల్లీ, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు సీఎం కేసీఆర్ తన బిడ్డను జైలుకు పంపేందుకు సిద్ధమయ్యారని పీసీసీ చీఫ్రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను రెండు నెలలు జైలులో పెట్టి ఎన్నికల్లో గెలవాలని ప్లాన్ చేస్తున్నారని అన్నారు. గ్రూప్ –1 పరీక్షల నిర్వహణలో ఫెయిల్ అయిన కేసీఆర్ ప్రభుత్వానికి సిగ్గుంటే తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శనివారం ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ ఆఫీసులో మీడియాతో రేవంత్ మాట్లాడారు. నిబంధలకు విరుద్ధంగా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించడం వల్లే హైకోర్టు ఆ పరీక్షలను రద్దు చేసిందన్నారు. టీఎస్ పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, ఇతర సభ్యులను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. వీరి స్థానంలో కొత్త కమిటీ వేసి పారదర్శకంగా, నిరుద్యోగులకు విశ్వాసం కల్పించేలా పరీక్షలు నిర్వహించాలని కోరారు. తెలంగాణ యువత భవిష్యత్ కోసం ఎన్ఎస్ యూఐ, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి కొట్లాడాలని పిలుపునిచ్చారు. టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలో తూతూ మంత్రంగా విచారణ నిర్వహించారని విమర్శించారు. ప్రభుత్వం పూర్తిగా పైరవీకారుల పరమైందని, రాష్ట్రంలో పాలన కుప్పకూలిందన్నారు. తెలంగాణ నిర్బంధంలో, ఎమర్జెన్సీలో కాలం వెళ్లదీస్తోందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రకటించిన 115 మంది అభ్యర్థుల్లో 86 మంది పక్క పార్టీల వాళ్లే ఉన్నారని విమర్శించారు. మంత్రుల్లో15 మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లే అని చెప్పారు.
కవితను జైలుకు పంపేందుకు ప్లాన్..
ఎన్నికల్లో గెలిచేందుకు కేసీఆర్ తన బిడ్డ కవితను జైలుకు పంపుతారని రేవంత్ ఆరోపించారు. ఇందుకోసం కేసీఆర్, ప్రధాని మోదీ ఇద్దరూ కలిసి కొత్త డ్రామాకు తెరలేపుతున్నారని అన్నారు. ‘‘వచ్చే నెలలో కవితను అరెస్ట్ చేస్తారట. ఎన్నికలు అయ్యే వరకు తీహార్ జైల్లో పెడతారట. ఆ సానుభూతితోని ఎన్నికల్లో గెలుస్తరట’’ అని రేవంత్ చెప్పారు. ఆ రెండు పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని, ఒకవేళ కవితను అరెస్ట్ చేసినా అదొక డ్రామా అన్నది ప్రజలు గమనించాలని కోరారు. అప్పట్లో మంత్రి కేటీఆర్ ఢిల్లీ వచ్చి అమిత్ షాను కలిశారని.. కాంగ్రెస్ లిస్ట్ రిలీజ్ చేయగానే దానిపై చర్చ జరగకుండా కవితకు ఈడీ నోటీసులు ఇవ్వాలని మాట్లాడుకున్నారని రేవంత్ ఆరోపించారు. ఈ నెల 17, 18, 19న కాంగ్రెస్ మీటింగ్ నుంచి దృష్టి మళ్లించేందుకే బీఆర్ఎస్, బీజేపీ కూడా మీటింగ్ లు పెట్టాయన్నారు. అయితే, సెప్టెంబర్ 17న సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ కొట్టిన సిక్సర్లని రేవంత్ అన్నారు. ఈ సిక్సర్ల తర్వాత ప్రజలు కాంగ్రెస్ కే ఓటేయ్యాలని డిసైడ్ అయ్యారని.. పెద్ద సంఖ్యలో నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
సీఈసీ ఫైనల్ చేసిన వాళ్లకే బీ ఫాంలు
కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ(సీఈసీ) ఎంపిక చేసిన వారికే పార్టీ బీ ఫాంలు అందుతాయని రేవంత్ స్పష్టం చేశారు. అప్పటి వరకు ఎన్నో మార్పులు, చేర్పులకు అవకాశం ఉంటుందన్నారు. సామాజిక న్యాయం చేసేలా కాంగ్రెస్ లిస్ట్ ఉంటుందని, అందుకే చర్చలు ఆలస్యం అవుతున్నాయన్నారు. ఎవరైనా సీటు కన్ఫాం అని డిసైడ్ అయితే తాము చెప్పేదేమీ లేదన్నారు. ఇంకా సీఈసీ మీటింగ్ తేదీ కూడా ఫైనల్ కాలేదన్నారు. అభ్యర్థుల అప్లికేషన్లలో కొన్నింటిపై స్క్రీనింగ్ కమిటీలో ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. అయితే కమిటీలోని ఐదుగురి సభ్యుల అభిప్రాయాలే ఫైనల్ కాదని, సర్వేలు, ప్రజాభిప్రాయాలు, గ్రౌండ్ రిపోర్ట్ లు తీసుకుంటామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సామాజిక న్యాయం చేస్తామన్నారు. మహిళలు, మైనార్టీలకు ప్రయార్టీ ఇస్తామన్నారు.