- ఎవరినీ వదలం..కుట్ర మూలాలను కనుగొంటం
- ఢిల్లీ బ్లాస్ట్‌పై భూటాన్ నుంచి ప్రధాని మోదీ వార్నింగ్
- ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు
- ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నయ్
- నిన్న రాత్రంతా నేను వారితో సమీక్ష చేశా
- బాధ్యులందరినీ చట్టం ముందు నిలబెడ్తం
- మృతులకు సంతాపం.. బాధిత కుటుంబాలకు మోదీ సానుభూతి
న్యూఢిల్లీ: రెడ్ఫోర్ట్వద్ద బాంబుదాడికి పాల్పడిన నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. కుట్ర మూలాలను కనుగొంటామని చెప్పారు. ఈ ఘటనపై ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ముమ్మర దర్యాప్తు చేస్తున్నాయని తెలిపారు. తాను సోమవారం రాత్రంతా వారితో టచ్‌లోనే ఉన్నానని చెప్పారు. ఈ దాడికి గల కారణాలను అధికారులు త్వరలోనే వెల్లడించనున్నారని తెలిపారు.
మంగళవారం ప్రధాని మోదీ భూటాన్‌లో పర్యటించారు. ఆ దేశ రాజధాని థింపులోని చాంగ్లి మెథాంగ్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ఢిల్లీ పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
బరువెక్కిన హృదయంతో ఇక్కడికొచ్చా..
దేశంలో ఉగ్ర కుట్రలను సహించేది లేదని మోదీ అన్నారు. ‘‘ఈ రోజు నేను బరువెక్కిన హృదయంతో ఇక్కడికి వచ్చా. నిన్న సాయంత్రం ఢిల్లీలో జరిగిన భయంకరమైన సంఘటన అందరినీ బాధపెట్టింది. బాధిత కుటుంబాల కన్నీళ్లను నేను అర్థం చేసుకున్నా. ఈ రోజు మొత్తం దేశం వారికి అండగా నిలుస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. రాత్రంతా అధికారులు, నిఘా సంస్థలతో మాట్లాడుతూనే ఉన్నామని చెప్పారు. ఢిల్లీ బ్లాస్ట్‌కు బాధ్యులందరినీ చట్టం ముందు నిలబెడతామని తెలిపారు.
