
- భారత అభివృద్ధి వరల్డ్ డెవలప్‌మెంట్‌కు ఉత్ర్పేరకంలా పని చేస్తది: మోదీ
- త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తం
- ఘనా పార్లమెంట్‌లో పీఎం స్పీచ్
- ఇరు దేశాల మధ్య కుదిరిన నాలుగు ఒప్పందాలు
- ఘనాలో ముగిసిన పర్యటన.. ట్రినిడాడ్ కు చేరుకున్న ప్రధాని
అక్రా(ఘనా): ప్రపంచానికి ఇండియా ఒక పిల్లర్ లాంటిదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొంది. ఇలాంటి తరుణంలో భారత్‌లోని ప్రజాస్వామ్య స్థిరత్వం ఆశాకిరణంగా ప్రకాశిస్తున్నది. భారత్‌లో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధి.. ప్రపంచ అభివృద్ధికి ఉత్ర్పేరకం లాంటిది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియా మరింత స్థిర, సుసంపన్న ప్రపంచం కోసం కృషి చేస్తుంది” అని పేర్కొన్నారు. ఘనా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ.. గురువారం ఆ దేశ పార్లమెంట్‌లో మాట్లాడారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని అన్నారు. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని చెప్పారు. గ్లోబల్ గ్రోత్‌లో తమ దేశం వాటా ఇప్పటికే 16 శాతంగా ఉందన్నారు. ‘‘భారత్ ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు. ఇండియాలో 2,500కు పైగా రాజకీయ పార్టీలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాలను 20 వేర్వేరు పార్టీలు పాలిస్తున్నాయి. 22 అధికారిక భాషలు, వేల మాండలికాలు ఉన్నాయి. విదేశీయులను మేం ఎల్లప్పుడూ విశాల హృదయంతో ఆహ్వానించడానికి ఇదీ ఒక కారణం” అని చెప్పారు.
గ్లోబల్ గవర్నెన్స్ లో సంస్కరణలు రావాలి..
ప్రపంచం క్లైమేట్ ఛేంజ్, కరోనా లాంటి మహమ్మారులు, టెర్రరిజం, సైబర్ సెక్యూరిటీ లాంటి సంక్షోభాలను ఎదుర్కొంటున్నదని ప్రధాని మోదీ అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గ్లోబల్ గవర్నెన్స్‌లో సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. గ్లోబల్ సౌత్ గొంతు వినిపించడానికి మాటలు మాత్రమే చెప్తే సరిపోదని, చేతల్లో చూపించాలని పిలుపునిచ్చారు. ఆఫ్రికా అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు.
నాలుగు ఒప్పందాలపై సంతకాలు..
ప్రధాని మోదీ ఘనా పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. జాయింట్ కమిషన్ ఏర్పాటు, ట్రెడిషనల్ మెడిసిన్‌లో ట్రైనింగ్, కల్చరల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌పై ఎంవోయూలపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. కాగా, ఘనా పర్యటన తర్వాత మోదీ గురువారం సాయంత్రం ట్రినిడాడ్ అండ్ టొబాగో చేరుకున్నారు.
మోదీకి ఘనా అత్యున్నత అవార్డు
ప్రధాని మోదీని ఘనా అత్యున్నత పురస్కారం ‘ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ అవార్డుతో ఆ దేశం సత్కరించింది. విశిష్ట రాజనీతిజ్ఞత, ప్రపంచ దేశాలను ప్రభావితం చేయగల నాయకత్వానికి గాను మోదీకి ఈ అవార్డు అందజేసింది. ఈ అవార్డును బుధవారం ఘనా రాజధాని అక్రాలో ఆ దేశ అధ్యక్షుడు జాన్ ద్రమానీ మహమ మోదీకి అందజేశారు. ‘‘ఘనా అత్యున్నత పురస్కారం అందుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. 140 కోట్ల మంది భారతీయుల తరఫున అవార్డును అందుకున్నాను. దీన్ని రెండు దేశాల యువత ఆకాంక్షలు, ఉజ్వల భవిష్యత్తు,చారిత్రక సంబంధాలు, సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీకగా భావిస్తున్నాను” అని మోదీ పేర్కొన్నారు.