తెలంగాణపై ఎయిర్ స్ట్రైక్స్: ప్రధాని మోదీ

తెలంగాణపై ఎయిర్ స్ట్రైక్స్: ప్రధాని మోదీ
  • రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఏటీఎంలా వాడుకుంటోంది
  • ఈ ఆటలు ఎక్కువ రోజులు సాగనివ్వను
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య స్కాంల సంబంధం
  • ఈ రెండు నాణేనికి రెండు వైపులా ఉండే పార్టీలు
  • కాళేశ్వరంలో అవినీతి అన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏమీ చేస్తలేదు
  • నాకు వచ్చిన గిఫ్టులు వేలం వేస్తే 150 కోట్లు వచ్చాయి
  • వాటిని ప్రజా సేవకు ఖర్చు చేశాను.. 
  •  దేశంలోని 140 కోట్ల ప్రజలే నా కుటుంబం
  • కుటుంబ పార్టీలకు ఫ్యామిలీ ఫస్ట్.. నాకు నేషన్ ఫస్ట్
  • సంగారెడ్డి  సభలో ప్రధాని నరేంద్ర మోదీ

హైదరాబాద్/ సంగారెడ్డి:  కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని, కక్కిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య స్కాంల బంధం ఉన్నదని ప్రధాని ఆరోపించారు. ఈ ఆటలు ఎక్కువ రోజులు సాగనివ్వబోనని అన్నారు. ఈ రెండు అవినీతి పార్టీలేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం ఏటీఎంలా మారిందని  చెప్పారు. త్వరలోనే తెలంగాణపై మోదీ సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్రైక్స్ చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో ప్రధాని మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని, నాణేనికి రెండు వైపులా ఉండే పార్టీలని అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఉన్నత స్థాయి కమిటీ వేశామని  ప్రధాని చెప్పారు. దేశంలోని 140 కోట్ల మంది భారతీయులంతా తన కుటుంబ సభ్యులేనని అన్నారు. 

జమ్ము కశ్మీర్ నుంచి తమిళనాడు వరకు చూస్తే కుటుంబ పార్టీలు పాలించే రాష్ట్రాలను పరిశీలిస్తే అసలు విషయం అర్థమవుతుందని అన్నారు. కుటుంబ పార్టీలు పాలించే రాష్ట్రాల్లో అవే బాగుపడ్డాయని, బీజేపీ పాలనలో దేశం బాగుపడిందని అన్నారు. కుటుంబ రాజకీయాలు చేసే వారు ఇతరులను రాజకీయంగా ఎదగనివ్వరని చెప్పారు.  కుటుంబ పార్టీలు దోచుకొని ఇండ్లలోని బీరువాలు  నింపుకుంటాయని, కానీ తాను అలా కాదన్నారు. తనకు వచ్చే జీతాన్ని కూడా పేదల కోసం ఖర్చు చేస్తున్నానని, దానాలు చేస్తున్నానని అన్నారు. తనకు వివిధ వేదికల మీద వచ్చిన గిఫ్టులను వేలం వేసి వచ్చిన రూ. 150 కోట్లను ప్రజాసేవకు ఖర్చు చేశానని చెప్పారు.

దేశమంతా మేదీ కుటుంబమే

తనకు కుటుంబమే లేదని ఇండియా కూటమి నేతలు విమర్శిస్తున్నారని, దేశంలోని 140 కోట్ల మంది ప్రజలంతా తన కుటుంబ సభ్యులని చెప్పారు. మోదీకి దేశమే ఫస్ట్ ప్రయార్టీ అని అన్నారు. తెలంగాణ ప్రజల అభిమానం, ప్రేమను వృథాగా పోనివ్వనని, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారిస్తానని పీఎం చెప్పారు. మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీలకే గ్యారెంటీ అని అన్నారు. గతంలో మాట ఇచ్చిన ప్రకారం ఆర్టికల్ 370  రద్దు చేశామని, అయోధ్యలో భవ్య  రామ మందిరం నిర్మించామని అన్నారు. ఈ సారి బీజేపీ 400కు పైగా ఎంపీ సీట్లలో విజయం సాధిస్తుందనే అపారమైన  నమ్మకం తనకు ఉందని అన్నారు.