కొత్త పార్లమెంట్ ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ

కొత్త పార్లమెంట్ ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ

కొత్త పార్లమెంట్ ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ

140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు ఈ పార్లమెంట్ ప్రతిబింబం

పేదలు, అట్టడుగు వర్గాల సాధికారతకు దారి చూపుతది

ఈ రోజు చిరస్థాయిగా నిలిచిపోతది

అధికార మార్పిడికి చిహ్నమైన సెంగోల్‌‌కు ఇప్పుడు సరైన గౌరవం దక్కిందని కామెంట్

లోక్‌‌సభలో ‘రాజదండం’ ఏర్పాటు.. రూ.75 కాయిన్, స్టాంప్ రిలీజ్

ఇండియా.. ప్రజాస్వామ్యానికే తల్లి

మన దేశం అభివృద్ధి చెందితే.. ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతది

న్యూఢిల్లీ : పార్లమెంట్​ కొత్త బిల్డింగ్.. కొత్త ఇండియాకు, 140 కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పేదలు, అట్టడుగు వర్గాల సాధికారతకు దారి చూపుతుందని అన్నారు. ‘అభివృద్ధి చెందిన దేశం’గా ఇండియా ఎదుగుదలను తెలియజేస్తుందని, ఇతర దేశాల పురోగతికి స్ఫూర్తినిస్తుందని చెప్పారు. ఆదివారం పార్లమెంట్​కొత్త బిల్డింగ్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. తర్వాత ‘సెంగోల్‌‌‌‌’ను లోక్‌‌‌‌సభలో ప్రతిష్టించారు. పార్లమెంట్​ కొత్త బిల్డింగ్ ఓపెనింగ్‌‌‌‌కు గుర్తుగా రూ.75 కాయిన్‌‌‌‌ను, స్టాంప్‌‌‌‌ను రిలీజ్ చేశారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, లోక్‌‌‌‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రసంగించిన తర్వాత ప్రధాని స్పీచ్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు.

ప్రపంచానికి సందేశం

‘‘ఒకదేశ అభివృద్ధి ప్రయాణంలో కొన్ని సందర్భాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇది అలాంటి రోజే. ఇది కేవలం బిల్డింగ్‌‌‌‌ మాత్రమే కాదు.. 140 కోట్ల మంది ప్రజల కలలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తుంది. ఇండియా సంకల్పం గురించి ప్రపంచానికి శక్తిమంతమైన సందేశం పంపుతుంది” అని ప్రధాని మోడీ అన్నారు. ఎన్నో ఏళ్ల విదేశీ పాలన మన ఆత్మగౌరవాన్ని మన నుంచి దొంగిలించిందని, నేడు భారతదేశం ఆ వలసవాద మనస్తత్వాన్ని వదిలివేసిందని అన్నారు. ఇండియా అభివృద్ధి చెందితే.. ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. బ్రిటీషర్ల నుంచి అధికార మార్పిడికి సెంగోల్ చిహ్నమని ప్రధాని అన్నారు. ఇప్పుడు దానికి దక్కాల్సిన గౌరవం దక్కిందన్నారు. చోళ సామ్రాజ్యంలో సెంగోల్‌‌‌‌ను కర్తవ్య మార్గానికి, సేవా మార్గానికి చిహ్నంగా పరిగణించే వారని అన్నారు.

25 పార్టీలు హాజరు

పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవానికి 25 పార్టీల నేతలు హాజరయ్యారు. రాష్ట్రపతి కాకుండా ప్రధాని ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ 20 అపోజిషన్​ పార్టీలు ఈ కార్యక్రమాన్ని బాయ్‌‌‌‌కాట్‌‌‌‌ చేశాయి. మాజీ రాష్ట్రపతి కోవింద్, మాజీ ప్రధాని హెచ్‌‌‌‌డీ దేవెగౌడ, కేంద్ర మంత్రులు, సీఎంలు జగన్, యోగి, ఏక్‌‌‌‌నాథ్ షిండే, నీఫు రియో, ప్రమోద్ సావంత్, హిమంత బిశ్వ శర్మ, పార్లమెంటేరియన్లు, ఇతర రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎంపీ సీట్లు పెరుగుతయ్

ఇండియా కేవలం ప్రజాస్వామ్య దేశం మాత్రమే కాదని, ప్రజాస్వామ్యానికే తల్లి అని ప్రధాని అన్నారు. ‘‘మన ప్రజాస్వామ్యమే మనకు స్ఫూర్తి.. మన రాజ్యాంగమే మన సంకల్పం. ఈ స్ఫూర్తికి, సంకల్పానికి పార్లమెంటు అత్యుత్తమ ప్రతినిధి. పార్లమెంట్ కొత్త భవనం.. పాత, కొత్త సహజీవనానికి సరైన ఉదాహరణ” అని మోడీ వివరించారు. పంచాయతీ బిల్డింగ్ నుంచి పార్లమెంట్ కాంప్లెక్స్‌‌‌‌ దాకా తమ నిబద్ధత ఒకేలా ఉందని స్పష్టం చేశారు. మనకు 25 ఏండ్ల సమయం ఉందని, ఈ కాలంలో ఇండియాను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. పార్లమెంటు సభ్యుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, అందువల్ల కొత్త పార్లమెంట్ నిర్మాణం అవసరమని అన్నారు. పార్లమెంట్ పాత భవనంలో కూర్చోవడానికే కాకుండా సాంకేతికంగానూ ఇబ్బంది ఉండేదని మోడీ చెప్పారు. ‘‘ పార్లమెంటు పాత భవనంలో కార్యకలాపాలు సాగించడం ఎంత కష్టంగా ఉండేదో మీకు తెలుసు. కూర్చోడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. ఇంకో విషయం ఏంటంటే.. భవిష్యత్​లో సీట్ల సంఖ్య పెరుగుతుంది. సభ్యులు పెరుగుతారు. మరి వాళ్లంతా ఎక్కడ కూర్చుంటారు?అందుకే.. ఇదే సమయమని భావించి కొత్త బిల్డింగ్ నిర్మించాం’’ అని వివరించారు.

కరతాళ ధ్వనులతో.. 

పూజల అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులోకి రాగా.. సభ్యులు కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు. ప్రధాని లోక్ సభ చాంబర్​లోకి అడుగుపెడుతుండగా ఎంపీలందరూ లేచి నిలబడి ఆహ్వానించారు. వారికి నమస్కరిస్తూ ప్రధాని ముందుకు కదిలారు. ఆయన వెంట లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌‌‌‌కర్ పంపిన సందేశాలను చదవి వినిపించారు. ప్రధాని ప్రసంగం ముగిసిన తర్వాత పలువురు నేతలతో ప్రధాని ముచ్చటించారు. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ తదితరులతో మాట్లాడారు. ఈ సమయంలో మోడీ.. మోడీ.. అంటూ సభ్యులు నినాదాలు చేశారు.

కొత్త పార్లమెంటు భవనం ఆత్మనిర్భర్ భారత్‌‌కు నిదర్శనంగా నిలుస్తుంది. పార్లమెంట్‌‌లో తీసుకునే ప్రతి నిర్ణయం సమాజంలోని అన్ని వర్గాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇక్కడ రూపొందించిన చట్టాలు పేదరికాన్ని తొలగించడానికి, సమాజంలోని పేదలు, దళితులు, గిరిజనులు, దివ్యాంగులు, ఇతర అట్టడుగు వర్గాలకు సాధికారత కల్పించడంలో సాయపడతాయి. పార్లమెంటు భవనంలోని ప్రతి ఇటుక, గోడ.. పేదల సంక్షేమానికి అంకితం కావాలి. కొత్త పార్లమెంట్.. కొత్త ఇండియా ఆకాంక్షలకు ప్రతిబింబం.

- ప్రధాని నరేంద్ర మోడీ

ప్రజల గొంతుతో నడుస్తది..

ప్రజాస్వామ్యం అనేది భవనా లతో కాదు ప్రజల గొంతుతో నడుస్తదని కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖర్గే అన్నారు. కొత్త పార్లమెంట్ బిల్డింగ్​ను రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించకుండా మహిళా లోకాన్ని కేంద్రం అవమానించిందని విమర్శించారు.  దేశంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందన్నారు. మహిళా ప్లేయర్లను రోడ్లపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లారని ఫైర్ అయ్యారు.

ఇద్దరి వాదనలు సమర్థనీయమే..

సెంగోల్ వివాదంపై కేంద్రం, ప్రతిపక్షాల వాదనలు సమర్థనీయంగానే ఉన్నా యని ఎంపీ శశిథరూర్  అన్నారు. రాజదండం సౌర్వభౌమాధికారం, ధర్మ నియమాన్ని కలిగి ఉంటుందని కేంద్రం చెబుతోందన్నారు. దేశప్రజల పేరుతో రాజ్యాంగం తయారైందన్న విపక్షాల వాదన కూడా కరెక్టేనని ఎంపీ కామెంట్​ చేశారు.

అలాంటి ఆధారాల్లేవు..

‘సెంగోల్’ను బ్రిటీష్ వారు ఇండియాకు అధికార మార్పిడికి చిహ్నంగా ఇచ్చారనేందుకు ఎలాంటి డాక్యుమెంట్ ఆధారాలు లేవని కాంగ్రెస్​ లీడర్​ జైరాం రమేశ్ విమర్శించారు. తమిళనాడులో తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రధాని మోడీ రాజదండాన్ని వాడుతున్నారని జైరాం రమేశ్​ ఆరోపణలు గుప్పించారు.

ఇంకోలా విమర్శించాల్సింది..

‘‘ఆర్జేడీకి పక్కా స్టాండ్ లేదు. పార్లమెంట్​ను శవపేటికతో ఎందుకు పోల్చారు? ఇంకేవిధంగానైనా విమర్శించి ఉండాల్సింది. ఈ యాంగిల్​ను ఎందుకు తీసుకొచ్చారు? ఆర్జేడీ ట్వీట్​ను ఖండిస్తున్నాం. పాత పార్లమెంట్ భవనానికి ఢిల్లీ ఫైర్ సర్వీస్ నుంచి క్లియరెన్స్ కూడా లేదు”అని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

దేశానికే గర్వకారణం : ద్రౌపది ముర్ము

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు తెలిపారు. యావత్ దేశానికి గర్వకారణమని కొనియాడారు. ప్రారంభోత్సవాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. కొత్త పార్లమెంట్ బిల్డింగ్ దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించే సందర్భమని అన్నారు. దేశానికి పార్లమెంట్ మార్గదర్శకమని, ప్రజాస్వామ్య ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని అన్నారు. ఆమె రాసిచ్చిన మెసేజ్​ను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభలో చదివి వినిపించారు.