యుద్ధం ఆపండి .. పుతిన్​కు మోదీ సూచన

యుద్ధం ఆపండి .. పుతిన్​కు మోదీ సూచన
  • బాంబుల మోత మధ్య శాంతి చర్చలు ఫలించవ్
  • చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలె 
  • రష్యా అధ్యక్షుడు పుతిన్​కుభారత ప్రధాని మోదీ పిలుపు

మాస్కో: బాంబుల మోత, బుల్లెట్ల వర్షం మధ్య శాంతి చర్చలు సఫలం కాలేవని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. యుద్ధరంగంలో ఏ సమస్యకూ పరిష్కారం దొరకదన్నారు. ఉక్రెయిన్ తో యుద్ధానికి ముగింపు పలకాలని, ఆ దేశంతో ఉన్న సమస్యను చర్చల ద్వారా దౌత్యపరంగానే పరిష్కరించుకోవాలని సూచించారు. భారత్–రష్యా 22వ వార్షిక సదస్సులో భాగంగా మంగళవారం మాస్కోలో పుతిన్ తో మోదీ భేటీ అయ్యారు. భారత్ శాంతి వైపే నిలబడుతుందని ప్రపంచానికి చాటి చెప్పారు.

కొత్త తరం వారి మెరుగైన భవిష్యత్తు కోసం శాంతి అత్యంత అవసరమన్నారు. ఉక్రెయిన్ తో యుద్ధానికి ముగింపు పలికే విషయంలో ఎలాంటి సహకారం అందించేందుకైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ‘‘ప్రజల ప్రాణాలు పోతుంటే మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరికీ బాధ కలుగుతుంది. అందులోనూ అమాయక పిల్లలు చనిపోతుంటే గుండె ముక్కలైపోతుంది” అని ప్రధాని చెప్పారు. సోమవారం ఉక్రెయిన్ లోని ఓ హాస్పిటల్ పై రష్యా జరిపిన మిసైల్ దాడుల్లో అనేక మంది పిల్లలు చనిపోయిన అశంపై మోదీ ఈ మేరకు పరోక్షంగా ఆందోళన వ్యక్తం చేశారు.

శాంతి, సుస్థిరత అంశాలపై గ్లోబల్ సౌత్ ఆకాంక్షలను కూడా పుతిన్ కు తెలియజేశానన్నారు. ‘‘ప్రపంచం ఆహారం, ఇంధనం, ఎరువుల కొరతను ఎదుర్కొంటున్నప్పుడు మన రైతులకు మాత్రం ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవాలి. ఇందులో రష్యా ఎంతో కీలక పాత్ర పోషించింది” అని కొనియాడారు. భారత రైతుల సంక్షేమం కోసం రష్యాతో సహకారాన్ని మరింత పెంపొందించుకుంటామని చెప్పారు. అలాగే ఇండియా 40 ఏండ్లుగా టెర్రరిజం అనే సవాల్​ను ఎదుర్కొంటోందని, తాను అన్ని రకాల టెర్రరిజాన్ని ఖండిస్తున్నానని ప్రకటించారు.

గత ఐదేండ్లలో ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొన్నదని, మొదట కరోనా.. ఆ తర్వాత అనేక రకాల సంఘర్షణలు వచ్చాయన్నారు. కాగా, రష్యన్ మిలిటరీలో సపోర్ట్ స్టాఫ్​గా పనిచేస్తున్న ఇండియన్లు అందరినీ విధుల నుంచి రిలీజ్ చేసేందుకు ఆ దేశం అంగీకరించింది. సోమవారం డిన్నర్ సందర్భంగా మోదీ చేసిన విజ్ఞప్తికి పుతిన్ ఆమోదం తెలిపారని విదేశాంగ శాఖ వెల్లడించింది.  కాగా, భారత్​లో మరో ఆరు హై పవర్ న్యూక్లియర్ పవర్​ ప్లాంట్​ యూనిట్లను నిర్మించేందుకు చర్చలు జరుపుతున్నట్లు రష్యా స్టేట్​ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ సీఈవో అలెక్సీ లిఖచేవ్ ​పేర్కొన్నారు.

మోదీకి థ్యాంక్స్: పుతిన్ 

ఉక్రెయిన్ సమస్య పరిష్కారంలో సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ధన్యవాదాలు తెలిపారు. మోదీతో జరిగిన సమిట్ లో ఆయన మాట్లాడుతూ.. ‘‘అతి ముఖ్యమైన అంశాలపై ప్రధానంగా ఉక్రెయిన్ సంక్షోభానికి పరిష్కార మార్గాలపై సహకరిస్తామని మీరు చెప్పినందుకు, శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించినందుకు ధన్యవాదాలు” అని తెలిపారు. దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య మంచి స్నేహబంధం ఉందన్నారు. ఎస్ సీవో, బ్రిక్స్ వంటి అంతర్జాతీయ వేదికలపై ఇకపైనా కలిసి పనిచేస్తామన్నారు. వచ్చే అక్టోబర్ లో రష్యాలోని కజాన్ సిటీలో జరిగే బ్రిక్స్ సమిట్ కు రావాలని మోదీని ఆహ్వానించారు. 

మోదీకి రష్యా అత్యున్నత పురస్కారం

ప్రధాని మోదీని రష్యా అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్ర్యూ ద అపోజిల్ ద ఫర్స్ట్ కాల్డ్’తో గౌరవించింది. మోదీకి ఈ పురస్కారాన్ని 2019లోనే ప్రకటించగా.. తాజాగా మంగళవారం రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్​లో జరిగిన కార్యక్రమంలో అధికారికంగా అవార్డును ప్రదానం చేశారు. రష్యా, ఇండియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచడంలో విశేష కృషి చేసినందుకు గాను మోదీకి ఈ అవార్డును ప్రకటించారు. 

క్రిమినల్​ను మోదీ హగ్ చేస్కున్నరు: జెలెన్ స్కీ 

ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ల భేటీపై ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోదిమర్ జెలెన్ స్కీ తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం పుతిన్, మోదీ అనధికారిక భేటీలో ఆలింగనం చేసుకోగా.. అదే సమయంలో ఉక్రెయిన్ లోని ఓ హాస్పిటల్ పై రష్యన్ మిలిటరీ బాంబుల వర్షం కురిపించింది. ఇందులో పలువురు చిన్నారులు సహా 29 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో జెలెన్ స్కీ ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు. ‘‘ఉక్రెయిన్ పై దారుణమైన దాడి జరిగిన ఈ రోజున.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం(భారత్) అధినేత.. ప్రపంచంలోనే అత్యంత కరుడుగట్టిన నేరస్తుడైన నేత(పుతిన్)ను మాస్కోలో కౌగిలించుకున్నారు. ఇది మాకు తీవ్ర నిరాశను కలిగించింది. శాంతి ప్రయత్నాలకు పెద్ద దెబ్బ” అని ఆయన ట్వీట్ చేశారు. 

భారత యువత ఓటమి  ఒప్పుకోదు! 

ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతోందని, మన దేశం ఇప్పుడు ప్రపంచ వేదికపై కీలకంగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. ‘‘దేశ యువత నేడు ఆఖరి క్షణం వరకూ, ఆఖరి బంతి వరకూ ఓటమిని ఒప్పుకోవడం లేదు” అంటూ టీం ఇండియా ఇటీవల టీ20 వరల్డ్ కప్ గెలవడాన్ని ప్రస్తావిస్తూ కొనియాడారు. పారిస్ ఒలింపిక్స్ కు కూడా బలమైన టీంను పంపుతున్నామన్నారు. ఇప్పుడు ఇండియన్లు ఏం తలుచుకుంటే అది చేయగలిగే స్థాయికి ఎదిగారన్నారు.

మంగళవారం మాస్కోలో భారత సంతతి ప్రజలతో జరిగిన సమావేశంలో మోదీ మాట్లాడారు. ‘‘రష్యా అనే పేరు వినగానే ప్రతి భారతీయుడి మదిలోనూ..‘సుఖాల్లోనూ, దు:ఖాల్లోనూ నమ్మకమైన దోస్తు’ అన్న విషయమే మెదులుతుంది. చలికాలంలో రష్యాలో టెంపరేచర్లు ఎంత మైనస్ కు పడిపోయినా.. ఇండియా, రష్యా ఫ్రెండ్షిప్ మాత్రం ఎల్లప్పుడూ ప్లస్ లోనే వెచ్చగా ఉంటుంది. ఈ అనుబంధం పరస్పర నమ్మకం, గౌరవం అనే పునాదిపై నిర్మితమైంది” అని ప్రధాని తెలిపారు.

moప్రధాన మంత్రిగా తాను రష్యాకు రావడం ఇది ఆరో సారి అని, ఇప్పటివరకూ పుతిన్ ను17 సార్లు కలిశానని చెప్పారు. రష్యాలో రాజ్ కపూర్ సినిమాలోని ‘సర్ పే లాల్ టోపీ.. ఫిర్ భీ దిల్ హై హిందూస్థానీ’ హిందీ సాంగ్ ఎంతో పాపులర్ అయిందని మోదీ గుర్తు చేశారు. మరో నటుడు మిథున్ చక్రవర్తికి కూడా రష్యాలో బాగా ఫాలోయింగ్ ఉందన్నారు. కాగా, రష్యాలోని కజాన్, యేకటెరిన్ బర్గ్ సిటీల్లో కూడా ఇండియన్ కాన్సులేట్ లను ప్రారంభించనున్నట్టు మోదీ వెల్లడించారు.