త్రిశూలం గుర్తుకే ఓటెయ్యండి...మంత్రి వివేక్ వెంకటస్వామి వల్లే కనీస వేతనాలు పెరిగాయ్

త్రిశూలం గుర్తుకే ఓటెయ్యండి...మంత్రి వివేక్ వెంకటస్వామి వల్లే కనీస వేతనాలు పెరిగాయ్
  •     కారుణ్య నియామకాలు, హెల్త్​ కార్డులు ఇప్పిస్తా 
  •     జలమండలి ఈయూ అధ్యక్ష అభ్యర్థి మొగుళ్ల రాజిరెడ్డి

ముషీరాబాద్,వెలుగు :  జలమండలి ఎన్నికల్లో త్రిశూలం గుర్తుకు ఓటేసి ఎంప్లాయీస్​యూనియన్​ను గెలిపించాలని ఐఎన్టీయూసీ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షుడు, యూనియన్ అధ్యక్ష అభ్యర్థి మొగుళ్ల రాజిరెడ్డి కోరారు. శుక్రవారం బాగ్ లింగంపల్లిలోని వీఎస్టీ ఫంక్షన్ హాల్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కార్మిక సంఘాలు లేకుండా చేసి కార్మికుల హక్కులను కాలరాసింది బీఆర్​ఎస్​ప్రభుత్వమని అందరికీ తెలిసిందేనన్నారు. ఆర్టీసీ కార్మికులు 52 రోజులు సమ్మె చేస్తే పట్టించుకోలేదని, కానీ, ఇప్పుడు కార్మికుల సంక్షేమంపై హరీశ్​రావు నీతులు చెప్తున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క సమస్య కూడా పరిష్కరించకుండా ఇప్పుడు ఏవేవో చేశామని పచ్చి అబద్ధాలాడుతున్నారన్నారు. 

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతే ఐఎన్టీయూసీ నేతృతంలో ఎన్నో సమస్యలు పరిష్కారమయ్యాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక పక్షపాతి అని, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో కార్మికుల కనీస వేతనాలు పెరిగాయని గుర్తు చేశారు. బోర్డులో కారుణ్య నియామకాలు, హెల్త్​కార్డులు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. శనివారం జరగనున్న జలమండలి కార్మిక సంఘాల ఎన్నికల్లో త్రిశూలం గుర్తుకు ఓటు వేసి ఎంప్లాయిస్ యూనియన్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.