
యూఏఈ వేదికగా వచ్చే నెలలో జరగబోయే ఆసియా కప్ 2025లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ భారత జట్టులో చోటు సంపాదిస్తాడా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఆసియా కప్ జరగనుంది. వాస్తవానికి షమీ టీ20 ప్రణాళికల్లో లేడు. అయితే ఆసియా కప్ లాంటి మెగా టోర్నీకి అనుభవం పనికొస్తుందని సెలక్టర్లు భావిస్తే ఈ పేసర్ కు స్క్వాడ్ లో చోటు కల్పించవచ్చు. బుమ్రా వర్క్ లోడ్ కారణంగా ఈ కాంటినెంటల్ టోర్నీకి దూరంగా ఉండడంతో అనుభవం కోసం సెలక్టర్లు షమీ వైపు మొగ్గు చూపుతారా లేదో ఇప్పుడు చూద్దాం.
ఆసియా కప్ కోసం భారత స్క్వాడ్ ను ఆగస్టు మూడో వారంలో ప్రకటించనున్నారు. ఈ కాంటినెంటల్ టోర్నీలో టీమిండియాను సూర్య కుమార్ యాదవ్ నడిపించనున్నాడు. 2026 టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని యంగ్ ఇండియా వైపు బీసీసీఐ ఆసక్తి చూపిస్తోంది. షమీ విషయానికి వస్తే అతను ప్రస్తుతం పూర్తి ఫిట్ గా ఉన్నాడో లేడో క్లారిటీ లేదు. బెంగాల్ అసిస్టెంట్ కోచ్ సౌరశిష్ లాహిరి.. షమీ ప్రస్తుతం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్నారని చెప్పాడు. ఆసియా కప్ కు సెలక్ట్ కాకపోతే దులీప్ ట్రోఫీ కోసం బెంగళూరులోని ఈస్ట్ జోన్ జట్టులో చేరే అవకాశం ఉంది.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బుమ్రా లేకపోవడంతో షమీని ఎంపిక చేశారు. ఈ టోర్నీలో 5 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించాడు. అయితే వన్డే ఫార్మాట్ కావడం.. బుమ్రా కూడా లేకపోవడంతో షమీకి ఛాన్స్ దక్కింది. ప్రస్తుతం టీ20 ఫార్మాట్ లో షమీని నమ్ముకునే పరిస్థితిలో భారత యాజమాన్యం లేనట్టు తెలుస్తోంది. అతని ఫిట్ నెస్ తో పాటు వయసు పొట్టి ఫార్మాట్ కు సహకరించడం కష్టం. 2025లో షమీ భారతదేశం తరపున 2 టీ20 మ్యాచ్ లు ఆడాడు. 5.3 ఓవర్లు బౌలింగ్ చేసి 9.43 ఎకానమీతో 3 వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు పవర్‌ప్లే బౌలర్లలో ఖలీల్ అహ్మద్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్ రేస్ లో ఉన్నారు.