సిరాజ్‌‌@15.. కెరీర్‌‌ బెస్ట్‌‌ ర్యాంక్‌‌కు చేరిన హైదరాబాదీ

సిరాజ్‌‌@15.. కెరీర్‌‌ బెస్ట్‌‌ ర్యాంక్‌‌కు చేరిన హైదరాబాదీ
  • నాలుగో ర్యాంక్‌‌లో జైస్వాల్‌‌

దుబాయ్‌‌:  ఇండియా పేసర్‌‌ మహ్మద్‌‌ సిరాజ్‌‌.. టెస్ట్‌‌ కెరీర్‌‌లో బెస్ట్‌‌ ర్యాంక్‌‌ను సాధించాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌‌లో సిరాజ్‌‌ 12 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్‌‌లో నిలిచాడు. ప్రస్తుతం అతని ఖాతాలో 674 రేటింగ్‌‌ పాయింట్లు ఉన్నాయి. ఇంగ్లండ్‌‌తో జరిగిన ఐదు మ్యాచ్‌‌ల టెస్ట్‌‌ సిరీస్‌‌లో విశేషంగా రాణించడం సిరాజ్‌‌ ర్యాంక్‌‌ మెరుగుపడటానికి దోహదం చేసింది. ఆఖరిదైన ఐదో టెస్ట్‌‌లో 9 వికెట్లు తీసి జట్టును గెలిపించడం కూడా అతనికి కలిసొచ్చింది. గతేడాది జనవరిలో 16వ ర్యాంక్ వరకు వచ్చి ఆగిపోయాడు. స్టార్‌‌ పేసర్‌‌ జస్‌‌ప్రీత్‌‌ బుమ్రా (889) టాప్‌‌ ర్యాంక్‌‌లోనే కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్‌‌తో మూడు టెస్టులే ఆడినా అతని ర్యాంక్‌‌లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. ప్రసిధ్‌‌ కృష్ణ (368).. 25 స్థానాలు మెరుగుపడి 59వ ర్యాంక్‌‌లో నిలిచాడు. ఇది అతని కెరీర్‌‌ బెస్ట్‌‌ కావడం విశేషం. సిరాజ్‌‌తో కలిసి ఒక టెస్ట్‌‌లో రెండు ఇన్నింగ్స్‌‌లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన రెండో ఇండియన్‌‌ జంటగా ప్రసిధ్‌‌ రికార్డులకెక్కాడు. 1969లో ఢిల్లీలో ఆస్ట్రేలియాపై స్పిన్నర్లు బిషన్‌‌ సింగ్‌‌ బేడీ, ఎర్రవల్లి ప్రసన్న ఈ ఫీట్‌‌ సాధించారు. 

జైస్వాల్‌‌ పాంచ్‌‌..

బ్యాటింగ్‌‌లో యశస్వి జైస్వాల్‌‌ (792) టాప్‌‌–5లో చోటు సంపాదించాడు. తాజా ర్యాంకింగ్స్‌‌లో మూడు ప్లేస్‌‌లు జంప్‌‌ చేసి ఐదో ర్యాంక్‌‌లో నిలిచాడు. ఇంగ్లండ్‌‌తో సిరీస్‌‌లో రెండు సెంచరీలు చేయడం అతనికి కలిసొచ్చింది. వికెట్‌‌ కీపర్‌‌ కమ్‌‌ డాషింగ్‌‌ బ్యాటర్‌‌ రిషబ్‌‌ పంత్‌‌ (768) ఒక్క ర్యాంక్‌‌ దిగజారి 8వ ప్లేస్‌‌ను సాధించాడు. కాలిపాదం గాయం కారణంగా ఐదో టెస్ట్‌‌ ఆడకపోవడంతో ర్యాంక్‌‌ దిగజారింది. కెప్టెన్‌‌ శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (725) నాలుగు ప్లేస్‌‌లు కిందకు దిగి 13వ ర్యాంక్‌‌లో ఉన్నాడు. రవీంద్ర జడేజా (616), కేఎల్‌‌ రాహుల్‌‌ (586) వరుసగా 31, 40వ ర్యాంక్‌‌ల్లో ఉన్నారు. ఇంగ్లండ్‌‌ సూపర్‌‌ స్టార్ జో రూట్‌‌ (908), హ్యారీ బ్రూక్‌‌ (868), కేన్ విలియమ్సన్‌‌ (858), స్టీవ్‌‌ స్మిత్‌‌ (816) టాప్‌‌–4లో కొనసాగుతున్నారు. ఆఖరి టెస్ట్‌‌లో సెంచరీ చేయడం వల్ల బ్రూక్‌‌కు రెండో స్థానం ఖాయమైంది. 

సిరాజ్‌‌పై కూడా దృష్టి పెట్టాలి..

స్టార్‌‌ పేసర్‌‌ జస్‌‌ప్రీత్‌‌ బుమ్రాలాగే మహ్మద్‌‌ సిరాజ్‌‌ వర్క్‌‌ లోడ్‌‌పై కూడా దృష్టి పెట్టాలని టీమిండియా మాజీ పేసర్‌‌ ఆర్పీ సింగ్‌‌ అన్నాడు. వీళ్లిద్దర్ని గాయాల బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నాడు. ‘భవిష్యత్‌‌లో సిరాజ్‌‌ గాయాలపాలు కాకుండా ఉండాలంటే వర్క్‌‌ లోడ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ను పరిగణనలోకి తీసుకోవాలి. ఇది చాలా కీలకం. తక్కువ టైమ్‌‌లో ఎక్కువ మ్యాచ్‌‌లు ఆడటం వల్ల పేసర్లు గాయాలబారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వర్క్‌‌ లోడ్‌‌ చక్కగా మెయింటేన్‌‌ చేస్తుండటం వల్లే బుమ్రా వన్డే, టీ20 వరల్డ్‌‌ కప్‌‌లో రాణించాడు. 

ఇప్పుడు సిరాజ్‌‌ కూడా అదే లైన్‌‌లో ఉన్నాడు. కాబట్టి అతన్ని కాపాడుకోవాలి. ఈ సిరీస్‌‌లో ఐదు టెస్ట్‌‌లు ఆడిన ఏకైక బౌలర్‌‌ సిరాజ్‌‌. ప్రతి మ్యాచ్‌‌లో పూర్తి శక్తి, తీవ్రతతో బౌలింగ్‌‌ చేశాడు. ఈ సిరీస్‌‌లో చివరి బ్యాట్స్‌‌మన్‌‌ను ఔట్‌‌ చేసిన లాస్ట్‌‌ బాల్‌‌ అతని ఐదు వేగవంతమైన బాల్స్‌‌లో ఒకటి. 143 కిలో మీటర్ల స్పీడ్‌‌తో యార్కర్‌‌ వేశాడు. సిరాజ్‌‌ అలసిపోయినట్లు ఎక్కడా కనిపించలేదు. సరైన లైన్‌‌ అండ్‌‌ లెంగ్త్‌‌తో బౌలింగ్‌‌ చేయడంపైనే దృష్టి పెట్టాడు. జట్టు అంచనాలకు మించి ఎక్కువగా ఇచ్చాడు. అతని ఫిట్‌‌నెస్‌‌, లయ అద్భుతంగా ఉంది’ అని ఆర్పీ సింగ్‌‌ వివరించాడు. బ్యాట్స్‌‌మన్‌‌లకు భాగస్వామ్యాలు అవసరమైనట్లుగానే బౌలర్లు కూడా జంటగా బౌలింగ్‌‌ చేయడానికి ఇష్టపడతారని చెప్పాడు. బుమ్రా ప్రత్యేకమైన యాక్షన్‌‌తో వికెట్లు తీస్తే.. అవతలి వైపు సిరాజ్‌‌ ఒత్తిడి పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాడన్నాడు. ఈ ఇద్దరి భాగస్వామ్యం చాలా ప్రత్యేకమైందన్నాడు. ఒకవేళ బుమ్రా లేకపోతే సిరాజ్‌‌ ఒంటరిగా పోరాడతాడని ఆర్పీ వెల్లడించాడు. 

ఇంగ్లండ్‌‌ టూర్‌‌ను ముగించుకున్న మహ్మద్‌‌ సిరాజ్‌‌ బుధవారం హైదరాబాద్‌‌ చేరుకున్నాడు. అతన్ని స్వాగతించడానికి ఫ్యాన్స్‌‌ బారులు తీరారు. ఫీల్డింగ్‌‌ కోచ్‌‌ టి. దిలీప్‌‌తో కలిసి లండన్‌‌ నుంచి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌‌ ఇంటర్నేషనల్‌‌ టెర్మినల్‌‌లో దిగిన సిరాజ్‌‌ కనెక్టింగ్‌‌ ఫ్లైట్‌‌లో హైదరాబాద్‌‌కు చేరుకున్నాడు. బ్లాక్‌‌ క్యాజువల్‌‌ డ్రెస్‌‌లో వచ్చిన సిరాజ్‌‌కు ఫ్యాన్స్‌‌ ఘనంగా స్వాగతం పలికారు. సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌‌ల కోసం ఎగబడ్డారు. కానీ సిరాజ్‌‌ కారులో ఎక్కి కనెక్టింగ్‌‌ ఫ్లైట్‌‌ కోసం డొమెస్టిక్‌‌ టెర్నినల్‌‌కు వెళ్లాడు. అక్కడ కూడా ఫ్యాన్స్‌‌ పోటెత్తారు. ‘మేం సిరాజ్‌‌తో ఇంకా మాట్లాడలేదు. ఏదైనా సన్మానం కోసం ప్లాన్‌‌ చేస్తాం. అతను కొంతకాలం హైదరాబాద్‌‌లోనే ఉండొచ్చు. దేశం తరఫున అద్భుతంగా ఆడటం మనందరికీ గర్వకారణం’ అని హైదరాబాద్‌‌ క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ (హెచ్‌‌సీఏ) అధికారి ఒకరు తెలిపారు.