ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన చిత్రం 'దృశ్యం'. ఒక సామాన్య మధ్య తరగతి వ్యక్తి ఒక కేసులో చిక్కుకున్న తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం చట్టం కళ్లకు గంతలు కట్టి ఆడే మైండ్ గేమ్ సినీ ప్రియులను మంత్రముగ్ధులను చేసింది.. ఇప్పుడు ఈ క్రేజీ సిరీస్‌లో మూడో భాగం ‘దృశ్యం 3’ రాబోతోంది. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ మే 21న థియేటర్లలోకి రానుంది.
జార్జ్ కుట్టికి మళ్ళీ కష్టాలు.
టీజర్ ప్రారంభంలో మొదటి రెండు భాగాలకు సంబంధించిన కొన్ని కీలక దృశ్యాలను చూపించారు. ఒక అన్ వాంటెడ్ గెస్ట్ (వరుణ్) రావడంతో జార్జ్ కుట్టి కుటుంబం ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆయన ఏ స్థాయికైనా వెళ్తారనే విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతానికి వస్తే.. చర్చిలో జీసస్ ముందు జార్జ్ కుట్టి ప్రార్థన చేస్తూ కనిపిస్తారు. ఇప్పుడు నాకు సెగ తగులుతోంది.. ఇంకెవరు నన్ను నిశితంగా గమనిస్తున్నారో నాకు తెలియడం లేదు అంటూ ఆయన చెప్పే డైలాగ్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అంటే, పోలీసుల నిఘా ఇంకా జార్జ్ కుట్టి మీద ఉందనే సంకేతాలను దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా తెలివిగా ఇచ్చారు.
మే 21 స్పెషల్:
ఈ చిత్రం మోహన్‌లాల్ 66వ పుట్టినరోజు మే 21న విడుదల కానుంది. అభిమానులకు ఇది ఒక పెద్ద బహుమతి అని చెప్పాలి. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబావూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మీనా, అన్సిబా హసన్, ఎస్తేర్ అనిల్ తమ పాత పాత్రలనే పోషిస్తున్నారు. అనిల్ జాన్సన్ సంగీతం టీజర్‌లో మరింత ఉత్కంఠను పెంచింది.
ముగింపు ఇదేనా?
'దృశ్యం' సిరీస్‌లో ఇదే చివరి భాగం అని ప్రచారం జరుగుతోంది. క్లైమాక్స్ విషయంలో దర్శకుడు జీతూ జోసెఫ్ ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ప్లాన్ చేశారని సమాచారం. గత రెండు భాగాల్లో మృతదేహాన్ని దాచడం, దొరకకుండా జాగ్రత్త పడటం చూశాము. మరి ఈ మూడవ భాగంలో జార్జ్ కుట్టి తన తప్పుల నుండి ఎలా బయటపడతారు? లేదా చట్టం ఆయనను పట్టుకుంటుందా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

