రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో వెయ్యేళ్ల నాటి శిలలు, కళాఖండాలు బయటపడ్డాయి. ఎనికెపల్లి శివారులో వెయ్యేళ్ల నాటి జైన తీర్థంకర శిలాఫలకాలను కనుగొన్నారు. 1000 సంవత్సరాల నాటి తీర్థంకరుల శిల్పాలతో కూడిన చతురస్రాకార స్తంభాలను గుర్తించామని పురావస్తు శాస్త్రవేత్త శ్రీనాథ్ రెడ్డి తెలిపారు.
జైన తీర్థంకర శిలాఫలకాలను సీనియర్ ఆర్కియాలజిస్ట్ఈమని శివనాగిరెడ్డి పరిశీలించారు. ఈ పురాతన శిలా ఫలకాలను ఊరిచెరువు కట్ట తూముకు ఇరువైపులా ఒకటి గ్రానైట్, మరొకటి నల్ల రాతి స్తంభాలను బిగించినట్లు అభిప్రాయపడ్డారు. ‘వాటి మీద ఆదినాథ, నేమినాథ, పార్శ్వనాథ, వర్థమాన మహావీర శిల్పాలు ధ్యాన ముద్రలో దర్శనమిస్తాయన్నారు.
ఈ రెండు శిలా ఫలకాల మీద క్రీస్తు శకం 9వ నుంచి 10వ శతాబ్దం మధ్య కాలం నాటి తెలుగు, కన్నడ శాసనాలున్నాయన్నారు. అయితే అ చిల్కూరుకు గ్రామానికి సమీపంలో ఉన్న జైన బసదికి చెందిన దాన శాసనాలు అని పేర్కొన్నారు. దాదాపు వందేళ్ల కిందట నిర్మించిన ఈ తూముకు స్థానిక శిథిల జైనాలయం నుంచి తెచ్చిన శిలా ఫలకాలను తెచ్చి బిగించి ఉంటారని శివనాగిరెడ్డి అభిప్రాయపడ్డారు.
