టెహ్రాన్: ఇజ్రాయెల్‌పై ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ సంచలన ఆరోపణలు చేశారు. టర్కీ, ఒమన్‌లపై దాడులు చేసింది ఇరాన్ కాదు ఇజ్రాయెలేనని ఆరోపించారు. ఇరాన్‌కు దాని పొరుగు దేశాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నంలో భాగంగా ఇజ్రాయెలే ఈ దాడులు చేసిందని పేర్కొన్నారు.
‘‘ఇరాన్‌తో సత్సంబంధాలు ఉన్న టర్కీ, ఒమన్ దేశాల్లోని కొన్ని ప్రాంతాలపై జరిగిన దాడులు ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ సాయుధ దళాలు చేయలేదు. ఇరాన్‌కు దాని పొరుగు దేశాలకు మధ్య విభేదాలు సృష్టించేందుకు ఇజ్రాయెల్ వేసిన ఒక ఎత్తుగడ. ఇలాంటివి మరికొన్ని దేశాల్లో కూడా జరగవచ్చు’’ అని మొజ్తబా పేర్కొన్నారు.
తమపై దాడులు చేసి ఇరాన్‌లో పాలన మార్పు చేయాలని అమెరికా, ఇజ్రాయెల్ భావించాయని కానీ అది ఘోరమైన తప్పుడు అంచనా అని అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ సంకుచిత మనస్తత్వం కంటే ఇరాన్ యుద్ధరంగం చాలా పెద్దదని ఆ రెండు దేశాలకు ఇరాన్ ప్రజలు తెలియజేశారన్నారు.
తన తండ్రి, దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ, పలువురు సైనిక ప్రముఖులను చంపేస్తే ప్రజలలో భయం, నిరాశలు ఏర్పడతాయని.. తద్వారా ఇరాన్‌పై ఆధిపత్యం చెలాయించి ఆ తర్వాత దానిని విచ్ఛిన్నం చేయాలన్న లక్ష్యంతో అమెరికా, ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని ప్రారంభించాయన్నారు. కానీ అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యం ఎన్నటికీ నేరవేరదని స్పష్టం చేశారు.
అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ధీటుగా ఇరాన్ ఎదుర దెబ్బ కొట్టడంతో ట్రంప్ పరస్పర విరుద్ధమైన మాటలు, అసంబద్ధమైన మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఇక, ఇస్లామిక్ దేశాలైన అప్ఘానిస్తాన్, పాకిస్తాన్ విభేదాలను పరిష్కరించుకోవాలని మొజ్తబా సూచించారు. దేవుని కోసం, ముస్లింల మధ్య విభేదాలను నివారించడానికి ఇరు దేశాలు పరస్పరం మెరుగైన సంబంధాలను నెలకొల్పుకోవాలని సూచించారు.
కాగా, తమపై ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతీకారంగా అమెరికా మిత్రదేశాలైన గల్ఫ్ కంట్రీస్ పై ఇరాన్ దాడులు చేస్తోన్న విషయం తెలిసిందే. ఖతార్, యూఏఈ, కువైట్, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడింది. అయితే.. టర్కీ, ఒమన్‌లపై మేం దాడులు చేయలేదని ఇరాన్ సుప్రీం లీడర్ ప్రకటించడం గమనార్హం. మరీ ఆ దేశాలపై దాడులు చేసింది ఎవరన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
