గోల్డ్ బిస్కెట్ల చోరీ కేసులో మరో ఐదుగురు అరెస్ట్

గోల్డ్ బిస్కెట్ల చోరీ కేసులో మరో ఐదుగురు అరెస్ట్
  • రూ.45 లక్షలు విలువైన 715 గ్రాముల గోల్డ్ బిస్కెట్లు స్వాధీనం
  •  గతంలోనే పట్టుబడ్డ నలుగురు నిందితులు

సికింద్రాబాద్, వెలుగు: ఐటీ అధికారులమని చెప్పి  మోండా మార్కెట్​లోని గోల్డ్ మెల్టింగ్ షాపులో బంగారు బిస్కెట్లను కొట్టేసిన కేసులో మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులు కాగా.. గతంలో నలుగురిని పట్టుకున్నారు. పరారీలో ఉన్న మిగతా ఐదుగురిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలను నార్త్ జోన్ డీసీపీ చందనాదీప్తి మీడియాకు వెల్లడించారు. హర్షద్ అనే వ్యక్తి మోండా మార్కెట్ డివిజన్ లోని పాన్ బజార్  లో సిద్ధి వినాయక పేరుతో గోల్డ్ మెల్టింగ్ షాపును నడుపుతున్నాడు. మహారాష్ట్రకు చెందిన జాకీర్ అతర్ ఘనీ(28) కొన్ని రోజుల కిందట హర్షద్ షాపులో వర్కర్ గా చేరాడు. అక్కడ బంగారు నగలను బిస్కెట్లుగా మెల్టింగ్ చేయడాన్ని చూసి వాటిని కొట్టేయాలని స్కెచ్ వేశాడు. మహారాష్ట్రకు చెందిన అముల్ గణపతిరావు జాదవ్(30), రుషికేశ్ జాదవ్  (25), శుభమ్ (25), సంజయ్ పరశురామ్ జాదవ్(27), రెహమాన్ ఘనీ(26), ప్రవీణ్ యాదవ్(24), ఆకాశ్ అరుణ్ హోవిల్(25), అభిజిత్ కుమార్ గొడికే(27)తో కలిసి జాకీర్ గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. వీరంతా మహారాష్ట్ర నుంచి మే  24న సిటీకి వచ్చి ప్యాట్నీ సెంటర్ లోని ఓ లాడ్జిలో దిగారు. జాకీర్ లాడ్జికి వెళ్లి చోరీకి సంబంధించిన ప్లాన్ ను వారికి చెప్పాడు. 

మే 27న ఉదయం 12 గంటలకు  జాకీర్ గ్యాంగ్​కు చెందిన వ్యక్తులు గోల్డ్ మెల్టింగ్ షాప్ వద్దకు వచ్చి  ఐటీ అధికారులమని చెప్పారు. షాపులో అక్రమంగా గోల్డ్ బిస్కెట్లు దాచారంటూ అక్కడ పనిచేస్తున్న వారిని బెదిరించారు. తర్వాత 100 గ్రాముల బరువున్న 17 బంగారు బిస్కెట్లను తీసుకుని పరారయ్యారు. షాప్ మేనేజర్ వికాస్ ఇచ్చిన కంప్లయింట్​తో కేసు ఫైల్ చేసిన మోండా మార్కెట్ పోలీసులు టాస్క్ ఫోర్స్ తో కలిసి దర్యాప్తు చేపట్టారు. దోపిడీకి పాల్పడ్డ ముఠా సభ్యులు మహారాష్ట్రలో థానేకు చెందిన వారిగా అనుమానించారు. ఐదు టీమ్స్ గా ఏర్పడ్డ పోలీసులు థానేకు వెళ్లి నిందితుల కోసం గాలించారు. మే 28న  రెహమాన్, జాకీర్, ప్రవీణ్, ఆకాశ్​ను అరెస్ట్ చేసి వారి నుంచి 573 గ్రాముల బరువున్న ఐదుకు పైగా గోల్డ్ బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. గత నెల 15న అభిజిత్​ను అరెస్ట్ చేసి అతడి నుంచి 30 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

శుక్రవారం మిగతా ఐదుగురు నిందితులు  రుషికేశ్, శుభమ్​, సంజయ్ ​,అమూల్ గణపతి రావ్ ను అరెస్టు చేసి వారి నుంచి  715 గ్రాముల  బరువున్న గోల్డ్ 
బిస్కెట్లు ఏడింటిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్​కు తరలించినట్లు డీసీపీ తెలిపారు.