క్రాప్ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మార్చింది కోతులే ! వరి, పత్తి సాగు పెరుగుదలకు కారణం అవే..

క్రాప్ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మార్చింది కోతులే ! వరి, పత్తి సాగు పెరుగుదలకు కారణం అవే..
  • కూరగాయలు, పండ్ల ఉత్పత్తిపై వానరాల ప్రభావం
  • రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల ఆందోళన
  • కోతుల బెడద నివారణపై పలు తీర్మానాలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో పెరుగుతున్న కోతుల బెడద వ్యవసాయ రంగాన్నే ప్రభావితం చేస్తున్నదని, రాష్ట్రంలో క్రాప్ ఫార్మాట్ మార్పునకు ఇదే ప్రధాన కారణమని రైతు సంఘాలు, వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. కోతుల దాడులతో పప్పు దినుసులు, కూరగాయలు, పండ్ల తోటలు, నూనెగింజల సాగు తగ్గిపోతుండగా.. వరి, పత్తి పంటల వైపు రైతులు మొగ్గుచూపుతున్నారని పేర్కొన్నారు.

మంగళవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సోమాజిగూడ ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో “సంక్షోభంలో తెలంగాణ వ్యవసాయ రంగం – కోతుల బెడదకు చెక్ పెట్టాలి, రైతాంగాన్ని కాపాడాలి” అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

కరుణాకర్ దేశాయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, వ్యవసాయ నిపుణులు దొంతి నర్సింహారెడ్డి, పద్మనాభరెడ్డి, పశ్య పద్మ, ఎమ్మెల్సీ తక్కెళపల్లి రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. అడవుల్లో నీటి కొరత, సంప్రదాయ పంటల తగ్గుదల, వ్యవసాయ విధానాల్లో మార్పులు వన్యప్రాణుల ఆహార వ్యవస్థను దెబ్బతీశాయని తెలిపారు. హరితహారంలో నీడనిచ్చే చెట్లకే ప్రాధాన్యం ఇచ్చి, పండ్ల చెట్లు నాటకపోవడం వల్ల కోతులు గ్రామాలవైపు వస్తున్నాయని పేర్కొన్నారు.

రాష్ట్రంలో కోతుల సమస్య కారణంగా గ్రామీణ జీవనం తీవ్రంగా దెబ్బతింటోందని, అనేక ప్రాంతాల్లో కూరగాయల సాగును ప్రజలు పూర్తిగా మానేశారని తెలిపారు. వేరుశనగ, జొన్న, పెసర, మామిడి, అరటిలాంటి పంటలకు 30 శాతం వరకు నష్టం వాటిల్లుతోందని వెల్లడించారు.

కోతుల దాడులతో రేబిస్‌‌, హెర్పిస్- బీ వైరస్‌‌, మంకీ ఫీవర్‌‌‌‌లాంటి వ్యాధుల ముప్పుపెరుగుతోందని నిపుణులు హెచ్చరించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 11 జిల్లాల్లో సమస్య తీవ్రంగా ఉందని, జనగామ, ములుగు జిల్లాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిందని పేర్కొన్నారు.

కోతుల సంఖ్యపై ప్రభుత్వానికి  స్పష్టత కరువు..
కోతుల సంఖ్యపై ప్రభుత్వానికి స్పష్టమైన అంచనా లేదని, గతంలో ఒక్కో ట్రూప్‌‌లో 12 నుంచి 15 కోతులు ఉండగా.. ప్రస్తుతం 200కు పైగా కోతులు గుంపులుగా తిరుగుతున్నాయని వక్తలు తెలిపారు.

మగ-ఆడ నిష్పత్తి 1:6గా ఉండటంతో జనాభా వేగంగా పెరుగుతోందన్నారు. సోలార్ ఫెన్సింగ్ ద్వారా 60 నుంచి 80 శాతం వరకు పంట నష్టాన్ని తగ్గించే అవకాశం ఉందని, రాష్ట్రవ్యాప్తంగా శాస్త్రీయ జనాభా గణన చేపట్టాలని డిమాండ్ చేశారు.

నిర్మల్‌‌లో ఏర్పాటు చేసిన మంకీ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్‌‌ను బలోపేతం చేయాలని, హిమాచల్‌‌ ప్రదేశ్ తరహాలో భారీ స్థాయిలో స్టెరిలైజేషన్ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కోతులు తినని కరివేపాకు, మునగ, చిక్కుడు, కాకరలాంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని, అడవుల్లో పండ్ల చెట్లు పెంచాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి అటవీ, పశుసంవర్థక, వ్యవసాయ శాఖల సమన్వయంతో కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని సమావేశంలో తీర్మానించారు.

కోతుల సమస్య నివారణకు ప్రతిపాదించిన కార్యాచరణ ప్రణాళిక

  • పంటలను రక్షించేందుకు సోలార్ ఫెన్సింగ్, సౌండ్ కానన్లు లాంటి ఆధునిక సాంకేతికతలను అమలు చేయాలి.
  • కోతుల వల్ల నష్టపోయిన రైతులకు పంట నష్టం పరిహారం, పంట బీమా కల్పించాలి.
  • తాత్కాలిక చర్యగా కోతులను పట్టుకొని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు గ్రామ పంచాయతీలకు సహాయం అందించాలి.
  • డ్రోన్లు, జీఐఎస్ మ్యాపింగ్ ద్వారా 2–3 నెలల్లో కోతుల జనాభా సర్వే పూర్తి చేయాలి.
  • సమస్యాత్మక గ్రామాలను గుర్తించి స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయాలి.
  • వ్యవసాయ విధానాలు, పంటల సరళి, నీటి వనరుల నిర్వహణలో మార్పులు తీసుకురావాలి.
  • అడవుల్లో, గ్రామాల సమీపంలో కోతులకు ఇష్టమైన పండ్ల చెట్లను నాటాలి.
  • కుంటలు, నీటి వనరులను అభివృద్ధి చేసి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలి.
  • అడవుల పునరుద్ధరణతో పాటు భారీ ఎత్తున స్థానిక, పండ్ల చెట్ల పెంపకం చేపట్టాలి.
  • ప్రతియేటా 25 వేల కోతులకు స్టెరిలైజేషన్ ఆపరేషన్లు నిర్వహించే లక్ష్యంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి.
  • మానవ-వన్యప్రాణుల ఘర్షణ తగ్గించేందుకు బఫర్ జోన్లలో అడవుల పెంపకం చేపట్టాలి.
  • రైతులు, నిపుణులు, స్థానిక సంస్థలు, అటవీ శాఖ సమన్వయంతో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు అమలు చేయాలి.
  • నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి, తగిన నిధులతో కోతులను తిరిగి అడవుల్లోకి పంపే చర్యలు చేపట్టాలి.