అక్టోబర్ ఫస్ట్ నుంచే ధాన్యం కొనుగోళ్లు 

అక్టోబర్ ఫస్ట్ నుంచే ధాన్యం కొనుగోళ్లు 
  • వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు సన్నాహాలు
  • రాష్ట్రవ్యాప్తంగా 8,224 కొనుగోలు సెంటర్ల ఏర్పాటు
  • ఇప్పటికే కొనుగోళ్లు, రవాణా ఏర్పాట్లపై పూర్తయిన సమీక్షలు 

హైదరాబాద్, వెలుగు:  వానాకాలం ధాన్యం కొనుగోళ్లు అక్టోబర్ ఫస్ట్ నుంచి షురూ కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 8,224 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా దాదాపు 65 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని సివిల్ సప్లయ్స్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ధాన్యం కొనుగోళ్ల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, కొనుగోళ్లు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

వాతావరణ మార్పులు, అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యాన్ని రక్షించేందుకు కొనుగోలు కేంద్రాల్లో తేమ కొలిచే యంత్రాలు, క్లీనర్లు, ధాన్యం ఆరబెట్టే యంత్రాలు, టార్పాలిన్లు సిద్ధం చేస్తున్నారు. అవసరమైన గన్నీ బ్యాగులను ముందుగానే సమకూర్చుతున్నారు.

ముందుగా నిజామాబాద్‌‌‌‌‌‌‌‌, నల్గొండలో సేకరణ..

ఈ వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌లో రాష్ట్రవ్యాప్తంగా 56.59 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. కోటిన్నర టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందనే అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో 65 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని సివిల్ సప్లయ్స్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ప్రతి కేంద్రంలో టార్పాలిన్లతో పాటు ఆటోమేటెడ్ ప్యాడీ క్లీనర్లు, డ్రైయర్లు ఏర్పాటు చేయాలని ఆయా జిల్లాల అధికారులను ఆదేశించారు.

ముందస్తుగా వరినాట్లు వేసిన నిజామాబాద్, నల్గొండ జిల్లాలో కొనుగోళ్లు ప్రారంభించనున్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు జరగాలని, ధాన్యం రవాణా, సేకరణలో లోపాలు ఉండకుండా చూడాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కొనుగోళ్లు, రవాణా ఏర్పాట్లపై సమీక్షలు పూర్తయ్యాయి.

కొనుగోలు కేంద్రాల్లో తగినంత మంది హమాలీలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి గోదాములు, మిల్లులకు ధాన్యం తరలించే ప్రతి వాహనానికి జీపీఎస్‌‌‌‌‌‌‌‌ ఆధారిత వీఎల్ టీఎస్ ట్రాకింగ్‌‌‌‌‌‌‌‌ వ్యవస్థ తప్పనిసరి చేశారు. ధాన్యం రవాణాను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ద్వారా పక్కదారి పట్టకుండా చూడటంతో పాటు కొనుగోలు నుంచి నిల్వ వరకు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  

బహిరంగ మార్కెట్‌‌‌‌‌‌‌‌లోనూ డిమాండ్

వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌లో దిగుబడి వచ్చే ధాన్యంలో అధిక భాగం రైతులు వారి సొంత వినియోగం కోసం కేటాయించుకునే నేపథ్యంలో కొనుగోలు సెంటర్లకు తక్కువగానే ధాన్యం వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు సన్నరకం ధాన్యాల్లో బీపీటీ 5204, ఆర్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ 15048, హెచ్‌‌‌‌‌‌‌‌ఎంటీ సోనా, జై శ్రీరామ్‌‌‌‌‌‌‌‌, కేఎన్‌‌‌‌‌‌‌‌ఎం 1638, డబ్ల్యూజీఎల్‌‌‌‌‌‌‌‌ 44, కేఎన్‌‌‌‌‌‌‌‌ఎం 7715 వంటి ఏడు రకాలను మాత్రమే రూ.500 బోనస్ కల్పిస్తున్నాయి.

మద్దతు ధర కామన్ రకానికి రూ.2,441, గ్రేడ్​ఏ రకానికి రూ.2,461 చొప్పున కేంద్రం నిర్ణయించింది. ఈ లెక్కన బోనస్ ఇస్తున్న 7 సన్న రకాలకు ధర రూ.2,941 పలికే అవకాశం ఉంది. అయితే ఎల్‌‌‌‌‌‌‌‌నినో నేపథ్యంలో రాష్ట్రంలో బియ్యం ధరలు గణనీయంగా పెరిగినందున బహిరంగ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో సన్న వడ్లకు భారీగా డిమాండ్ ఉంటోంది. దీంతో సెంటర్లకు ఈ సన్న వడ్లు రావడం కష్టమేనని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో సివిల్ సప్లయ్స్ శాఖ టార్గెట్ 65 లక్షల టన్నుల కంటే తక్కువే వచ్చే  చాన్స్​ ఉందని తెలుస్తోంది.