
న్యూఢిల్లీ: మండుటెండల్లో -భారత వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఈ ఏడాది వర్ష కాలం ముందే వచ్చేటట్లు ఉందని ఐఎండీ అంచనా వేసింది. మంగళవారం (మే 13) దక్షిణ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, ఉత్తర అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలను నైరుతి రుతుపవనాలు తాకాయని ఐఎండీ వెల్లడించింది. మాన్సూన్ ప్రభావంతో గత రెండు రోజులుగా నికోబార్ దీవుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయని కేంద్ర వాతావారణ శాఖ వెల్లడించింది.
సాధారణంగా ప్రతి ఏడాది నైరుతి రుతుపవనాలు జూన్ 1 నాటికి కేరళలో ప్రారంభమై.. జూలై 8 నాటికి దేశం మొత్తం విస్తరిస్తాయి. సెప్టెంబర్ 17 నాటికి వాయువ్య భారతదేశం నుంచి తిరోగమనం ప్రారంభించి అక్టోబర్ 15 నాటికి పూర్తిగా మాన్ సూన్ క్లోజ్ అవుతోంది. కానీ ఈ ఏడాది జూన్ 1కంటే ముందుగానే అంటే.. 2025, మే 27 నాటికే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని ఐఎండీ అంచనా వేసింది. 2025, జూన్ 12వ తేదీ వరకు నైరుతి రుతుపవనాలు తెలంగాణలో విస్తారించనున్నాయి.
దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమోరిన్, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని మిగిలిన ప్రాంతాలు, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల్లో రుతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనిఐఎండీ వెల్లడించింది. నైరుతి రుతు పవనాల ప్రభావంతో మరో వారం రోజుల్లో దేశంలో ఉష్ణోగ్రతల తీవ్రత తగ్గుతోందని తెలిపింది. కాగా, 2025లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసిన విషయం తెలిసిందే.