భారత్ జోడో యాత్రతో తేడా ఏముండదు: మూడ్ ఆఫ్ ది నేషన్

భారత్ జోడో యాత్రతో తేడా ఏముండదు: మూడ్ ఆఫ్ ది నేషన్

భారత్ జోడో యాత్రతో ప్రజలతో మమేకం అయ్యేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఈ యాత్ర ఆ పార్టీకీ ఎంతవరకు తోడ్పడింది అన్న అంశంపై మూడ్ ఆఫ్ ది నేషన్ ఓ పోల్ నిర్వహించింది. ఈ యాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చిందని, కానీ దాని వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం మాత్రం సాధ్యం కాదని ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 37శాతం మంది అభిప్రాయపడ్డారు.  దేశ ప్రజలతో కనెక్ట్ కావడానికి కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి ఈ యాత్ర చాలా ఉపయోగపడిందని 29% చెప్పినట్టు సర్వే వెల్లడించింది. రాహుల్ గాంధీకి ఈ యాత్ర మరో రీ బ్రాండింగ్ వ్యాయామం లాంటిదని13% భావించినట్టు తెలిపింది. ఇక మరో 9 శాతం మంది ఈ యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీలో వచ్చే తేడా ఏమీ ఉండదని చెప్పినట్టు పేర్కొంది.

కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపేందుకు సరిపోయేవారెవరు..? 

ఈ ప్రశ్నకు మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్‌లో రాహుల్ గాంధీకి 26శాతం మంది ఓటెయ్యగా.. మరో 17శాతం సచిన్ పైలట్ కు మొగ్గు చూపారు.

ప్రతిపక్ష నాయకత్వానికి ఎవరు సరిపోతారు..?

ఈ ప్రశ్నకు రాహుల్ గాంధీ కంటే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ లు సరిపోతారని సర్వేలో తేలింది. అందుకు గాను ఉత్తమ ప్రతిపక్షంగా కేజ్రీవాల్ కి 24శాతం మంది, మమతా బెనర్జీకి 20 శాతం మంది ఓటేసినట్టు పేర్కొంది. ఇదిలా ఉండగా ప్రతిపక్షాలకు నాయకత్వం వహించేందుకు రాహుల్ గాంధీ సరిపోతారని 13 శాతం మంది మాత్రమే అభిప్రాయపడడం గమనార్హం.

ప్రధాని మోడీని ప్రతిపక్ష కూటమి సవాల్ చేయగలదా?

ప్రతిపక్ష కూటమి ప్రధాని మోడీకి సవాలు విసరగలదని నమ్మిన ప్రజల శాతం గతేడాది కంటే ఈ సారి కొంత తగ్గుముఖం పట్టింది. ఇది 2022 జనవరిలో 49 శాతం ఉంటే, జనవరి 2023 నాటికి ఈ సంఖ్య 39కి చేరిందని మూడ్ ఆఫ్ ది నేషన్ స్పష్టం చేసింది.