
బషీర్‌బాగ్, వెలుగు : ‘బీసీ ఉద్యమాన్ని భుజాన ఎత్తుకున్న కవిత ఏ కులంలో పుడితే మల్లన్నకు ఎందుకు? విద్య, ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు కావాలని కవిత కొట్లాడింది. మల్లన్న నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు’ అంటూ జాగృతి హెచ్చరించింది.
కవితపై మల్లన్న కామెంట్స్‌ను నిరసిస్తూ తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ఆధ్వర్యంలో ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాగృతి అధికార ప్రతినిధి ఎల్చాల దత్తాత్రేయ మాట్లాడుతూ.. తమ నాయకురాలు కవితను ఏదైనా అంటే ఊరుకునేది లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో తీన్మార్ మల్లన్న ఎక్కడున్నారని ప్రశ్నించారు.
బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్యను విమర్శించిన చరిత్ర మల్లన్నదని అన్నారు. మల్లన్న యూ ట్యూబ్ చానెల్ ద్వారా బెదిరింపులకు, ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారన్నారు. జాగృతి స్టేట్ యూత్ ప్రెసిడెంట్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ మల్లన్న మాట్లాడుతూ.. మల్లన్న వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పకపోతే పెద్ద ఎత్తున దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మహిళ అని కూడా చూడకుండా రాజకీయ మైలేజ్ కోసమే తీన్మార్ మల్లన్న కవితపై ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామని యునైటెడ్ పూలే ఫ్రెంట్ కన్వీనర్ బొల్లా శివశంకర్ అన్నారు. కవితకు వెంటనే మల్లన్న క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ కలిసి పని చేస్తున్నాయని, గత ఏడాదిన్నరగా కామారెడ్డి డిక్లరేషన్ అమలుతో పాటు బీసీల సమస్యలపై పోరాటం సాగిస్తున్నామన్నారు. వ్యక్తిగత దూషణల కారణంగానే క్యూ న్యూస్ ఆఫీస్ పై దాడులు జరిగాయన్నారు. యునైటెడ్ పూలే ఫ్రంట్ కో-ఆర్డినేటర్ అలకుంట్ల హరి మాట్లాడుతూ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పై మొదట మాట్లాడింది కవితనే అని పేర్కొన్నారు. ఆమెకు ఎక్కడ పేరు వస్తుందో అని ఇలాంటి వ్యక్తిగత దూషణలు చేస్తున్నారన్నారు. బేషరతుగా కవితకు క్షమాపణలు చెప్పాలన్నారు. రాష్ట్ర కో-కన్వీనర్లు ఎలుకొండ రాం కోటి, పెద్దాపురం కుమారస్వామి పాల్గొన్నారు.