ఒకే ఇంటి నంబర్​తో వందకుపైనే ఓటర్లు

ఒకే ఇంటి నంబర్​తో వందకుపైనే ఓటర్లు
  • 7.66 లక్షల ఇండ్లకు 75.97 లక్షల ఓట్లు
  • యావరేజ్​గా ఒక్కో ఇంట్లో 10కిపైన ఓటర్లు
  • ఎన్నికల అధికారుల సర్వేతో వెలుగులోకి
  • అన్నీ సవరిస్తామన్న సీఈవో వికాస్ రాజ్

హైదరాబాద్, వెలుగు: ఒక ఇంటి నంబర్​తో కనీసం మూడు ఓట్లు.. లేదంటే గరిష్టంగా 8 ఓట్లు ఉంటాయి. కానీ, రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో ఒకే ఇంటి నంబర్​పై వందల కొద్ది ఓట్లు రిజిస్టరై ఉన్నాయి. బీఎల్​వోలు, ఎన్నికల అధికారులు చేస్తున్న ఇంటింటి సర్వేతో ఈ విషయం వెలుగులోకొచ్చింది. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్​వో) నెట్​తో పాటు వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన కంప్లయింట్స్ ఆధారంగా ఒకే ఇంట్లో ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్న వారి వివరాలు సేకరించేందుకు అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపడ్తున్నారు. ఒకే డోర్ నంబర్​తో పదుల సంఖ్యలో ఓట్లు ఉన్న వారి వివరాలను సేకరిస్తున్నారు. 

కార్వాన్​లో ఒకే ఇంటి నంబర్​తో 13 ఇండ్లల్లో వందకు పైగా ఓట్లు గుర్తించారు. అలాగే, ఒక డోర్ నంబర్​పై 68 మంది ఓటర్లు నమోదై ఉన్నారు. గ్రౌండ్ లెవల్​లో ఈ ఇంటికి వెళ్లి పరిశీలిస్తే.. నలుగురే ఉన్నట్లు అధికారులు తేల్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,66,557 ఇండ్లను అధికారులు సర్వే చేశారు. ఈ ఇండ్లల్లో 75.97 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. అంటే, యావరేజ్​గా ఒక్కో ఇంట్లో 10 మంది పైనే ఓటర్లు ఉన్నట్లు స్పష్టమవుతున్నది. వీటిని ఎలక్షన్ అధికారులు సరి చేస్తున్నారు. రాజేంద్రనగర్ పరిధిలో ఒకటే ఇంటి నంబర్ మీద 57 ఓటర్లు, ఎల్బీనగర్​లో 38 ఓటర్లు నమోదయ్యారు. మల్కాజ్​గిరి, యాకుత్​పురా నియోజకవర్గాల్లోనూ ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయి. కొన్నిచోట్ల ఒకటే పోలింగ్ కేంద్రం పరిధిలో వేరే ఇంటి నంబర్​తో కూడా ఓటరుగా నమోదైనట్లు గుర్తించారు. యాకుత్​పురాలోని 11 ఇండ్లల్లో 50కి పైగా, 3 ఇండ్లల్లో 103, 107, 108 ఓటర్లను అధికారులు గుర్తించారు. 

9 లక్షల అప్లికేషన్లు క్లియర్

బీఎల్వోలు, ఎన్నికల అధికారులు జరిపిన సర్వేలో ఎక్కువగా కార్వాన్ అసెంబ్లీ సెగ్మెంట్​లో 17,398 ఇండ్లకు 2,20,316 మంది ఓటర్లను గుర్తించారు. యాకుత్​పురా నియోజకవర్గ పరిధిలో 14,883 ఇండ్లకు 1,84,060 ఓటర్లు, రాజేంద్రనగర్ సెగ్మెంట్​లో 13,901 ఇండ్లకు 1,57,972 ఓటర్లు, ఎల్బీనగర్​లో 13,987 ఇండ్లకు 1,48,378 ఓటర్లు, మల్కాజ్​గిరిలో 10,649 ఇండ్లకు 1,06,336 మంది ఓటర్లను గుర్తించారు. అలాగే, ఫారం 8 ద్వారా ఓటర్ కార్డులోని చిరునామాతో పాటు ఇతర మార్పులు, ఓటర్ కార్డులను మార్చుకునే దాంట్లో 9 లక్షల అప్లికేషన్లను పరిష్కరించారు.

అక్టోబర్ 4న ఓటర్ల తుది జాబితా

రాష్ట్రంలో ఇప్పుడు ఓటర్ల నమోదుకు సంబంధించి సెకండ్ స్పెషల్ సమ్మరీ రివిజన్ కొనసాగుతున్నది. ఇటీవల డ్రాఫ్ట్ ఓటర్ల లిస్ట్​ను ఈసీ ప్రకటించింది. దీని ప్రకారం రాష్ట్రంలో 3.06 కోట్ల ఓటర్లు ఉన్నారు. దీనిపై ఇప్పుడు వినతులు, అభ్యంతరాలను స్వీకరిస్తున్నది. దీనికి సెప్టెంబర్ 19 డెడ్​లైన్ విధించింది. అక్టోబర్ 4న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తుంది. ప్రస్తుతం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ప్రతివారం రాజకీయ పార్టీలతో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఈఆర్ వోలు సమావేశాలు నిర్వహిస్తున్నారు.

జీహెచ్​ఎంసీ, చుట్టుపక్కల సెగ్మెంట్లలోనే ఎక్కువ

ఒకే ఇంట్లో ఎక్కువ సంఖ్యలో నమోదైన ఓటర్ల వివరాలను సమగ్ర ఇంటింటి సర్వే ద్వారా పరిశీలించాలని సీఈవో వికాస్ రాజ్ అధికారులను ఆదేశించారు. అవసరమైన మార్పులు చేసి ఓటర్ల జాబితాల్లో తప్పులను సరి చేయాలని సూచించారు. ఒకటే డోర్ నంబర్​తో ఎక్కువ ఓట్లు ఉండటంతో పాటు.. జీరో డోర్ నంబర్​తోనూ బోగస్ ఓట్లు నమోదైనట్లు గుర్తిస్తున్నారు. ఓటరు గుర్తింపు కోసం అప్లై చేసుకుంటే.. లిస్ట్​లో పేరు రాలేదని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. అదే ఓటరు లిస్ట్​లో రెండు, మూడు చోట్ల నమోదైనోళ్లు ఉంటున్నారు. ఇది పోలింగ్ డే రోజు తీవ్ర గందరగోళానికి దారితీస్తుంది. చాలాచోట్ల డబుల్ ఓట్లు వేస్తున్నారనే విమర్శలున్నాయి.