
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేసులు ఇప్పటికే 54వేలు దాటాయి. దీంతో అక్కడ చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. అయినా చాలా మంది జనాలు వీధుల్లో తిరుగుతూ కనిపిస్తున్నారు. బయటికెందుకొచ్చారని అధికారులు అడిగితే ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి తరుణంలో దేశమంతా లాక్‌డౌన్ ప్రకటించాలని మెడికల్ అడ్వైజర్లు కోరగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఆ ప్రసక్తే లేదంటున్నారు. దాని వల్ల దేశ ఎకానమీపై తీవ్రమైన భారం పడుతుందని చెప్పారు. నంబర్ వన్ ఎకానమీ దేశంలో ఇలా షట్‌డౌన్ చేయలేమన్నారు. చాలా తక్కువగా ఎఫెక్టయిన ప్రాంతాల్లో 100 శాతం మూసేస్తే ఏం లాభమని ప్రశ్నించారు.
కరోనా వ్యాప్తి వాళ్ల తప్పు కాదు
మెడికల్ సప్లై దొంగ నిల్వలను కట్టడి చేసేందుకు గాను అందుకు సంబంధించిన చట్టంపై ట్రంప్ సంతకం చేశారు. ఫేస్ మాస్కులు, శానిటైజర్లు సహా ఇతర నిల్వలను అక్రమంగా దాచి ఉంచినట్టు తెలిసినట్టయితే చర్యలు తప్పవన్నారు. ఈ మధ్య కరోనాను ‘చైనీస్ వైరస్’ అని ట్రంప్ అనడంతో అమెరికాలోని ఆసియా అమెరికా కమ్యూనిటీపై దాడులు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికాతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆసియా అమెరికా కమ్యూనిటీని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని ట్రంప్ అన్నారు. కరోనా వ్యాప్తి వాళ్ల తప్పు కాదని చెప్పారు.
హైడ్రాక్సీ క్లోరోక్విన్, జెడ్ పాక్‌తో..
హైడ్రాక్సీక్లోరోక్విన్, జెడ్ పాక్ కాంబినేషన్‌తో కరోనాను కట్టడి చేయొచ్చని, ఇదే గనక అందరికీ పని చేస్తే అది దేవుడి గిఫ్టవుతుందని ట్రంప్ అన్నారు. ఇదే కాంబినేషన్‌ను ఓ పేషెంట్‌కు ఇచ్చామని, కోలుకున్నాడని చెప్పుకొచ్చారు. త్వరలో జరగనున్న ప్రెసిడెంట్ ఎన్నికలపై కరోనా ప్రభావం పడింది. రోజురోజుకు వ్యాధి విజృంభిస్తుండటం, డాక్టర్లు దేశాన్ని షట్‌డౌన్ చేయాలని సూచిస్తుండటంతో క్యాంపెయిన్ కష్టమవుతోందని ట్రంప్ సహనం కోల్పోతున్నట్టు తెలిసింది. నవంబర్‌లో మళ్లీ అధ్యక్ష ఎన్నికలున్న దృష్ట్యా దేశంలో ఎకనమిక్ డ్యామేజ్‌ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ స్టాక్‌మార్కెట్ పతనాన్ని ఎంత ఆపుదామని ప్రయత్నించినా కుదరట్లేదు. మరోవైపు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను త్వరలో ఎత్తేస్తామని ట్రంప్ చెబుతున్నారు. ‘వ్యాధి కన్నా చికిత్స ప్రమాదకరంగా ఉండొద్దు. ఈ 15 రోజుల గడువు ముగిశాక ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాం’ అని ట్వీట్ చేశారు. డాక్టర్లు, నిపుణులు మాత్రం ఆంక్షలు సడలించొద్దని, ఇంకొన్ని రోజులు ఉండాలని సూచిస్తున్నారు.