మోస్ట్‌ చాలెంజింగ్‌ కప్‌: వరల్డ్ కప్ పై కోహ్లీ వ్యాఖ్యలు

మోస్ట్‌ చాలెంజింగ్‌ కప్‌: వరల్డ్ కప్ పై కోహ్లీ వ్యాఖ్యలు

అత్యుత్తమ జట్లు పోటీపడుతుండటంతో ఈ వరల్డ్‌‌కప్‌‌ మోస్ట్‌‌చాలెంజింగ్‌‌గా మారిందని టీమిండియా కెప్టెన్‌‌విరాట్‌‌కోహ్లీ అన్నాడు. టీమ్‌‌అదృష్టం మారాలంటే తొలి బంతి నుంచే ప్రతాపం చూపించాల్సి ఉంటుందన్నాడు. తాము నాలుగు కఠిన మ్యాచ్‌‌లు ఆడాల్సి ఉండటంతో కనీసం ఊపిరి సలిపే అవకాశం కూడా లేదన్నారు. మంగళవారం ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో కోచ్​ రవిశాస్త్రితో కలసి కోహ్లీ పాల్గొన్నాడు. ఈ నెల 30న మొదలయ్యే వరల్డ్‌‌కప్‌‌ కోసం టీమిండియా బుధవారం లండన్‌ ‌బయల్దేరనుంది.

రౌండ్‌‌ రాబిన్‌‌ పద్ధతిలో  ప్రపంచ స్థాయి అత్యుత్తమ జట్లు పోటీపడుతుండటంతో ఈ వరల్డ్‌‌కప్‌‌ అతిపెద్ద సవాలు (మోస్ట్‌‌ చాలెంజింగ్‌‌)గా  మారిందని టీమిండియా కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ అన్నాడు. టీమ్‌‌ అదృష్టం మారాలంటే తొలి బంతి నుంచే తీవ్రత కొనసాగించాలన్నాడు. తాము నాలుగు కఠిన మ్యాచ్‌‌లు ఆడాల్సి ఉండటంతో కనీసం ఊపిరి సలిపే అవకాశం కూడా లేదన్నాడు. మెగా ఈవెంట్‌‌ కోసం లండన్‌‌ బయలుదేరే ముందు చీఫ్‌‌ కోచ్‌‌ రవిశాస్త్రితో కలిసి విరాట్‌‌ మీడియాతో మాట్లాడాడు. ‘నా వరకైతే ఇన్ని సవాళ్లతో కూడిన వరల్డ్‌‌కప్‌‌ను చూడలేదు. ఫార్మాట్‌‌, బలమైన జట్ల కారణంగా మెగా ఈవెంట్‌‌లో పోటీ పెరిగింది. ఒకసారి అఫ్ఘానిస్థాన్‌‌ జట్టునే చూడండి. 2015 నుంచి ఇప్పటికి ఎంతో మార్పు చెందింది. ఏ జట్టు ఎవరినైనా ఓడించొచ్చు. ఇదొక్కటే మనం మనసులో పెట్టుకోవాలి.  సాధ్యమైనంత వరకు అత్యుత్తమ క్రికెట్‌‌ ఆడటంపైనే  దృష్టిపెట్టాలి. గ్రూప్‌‌ దశ పరిస్థితులు లేవు కాబట్టి ప్రతి మ్యాచ్‌‌లో చావో రేవో తేల్చుకోవాల్సిందే. అక్కడి పరిస్థితులకు అలవాటు పడటం కూడా ప్రతి జట్టుకు కత్తిమీద సామే. ఇదో కొత్త రకమైన చాలెంజ్‌‌’ అని కోహ్లీ పేర్కొన్నాడు.  మిగతా అంశాలు అతని మాటల్లోనే..

తొలి 4 మ్యాచ్‌‌ల గురించి

మొదటి నాలుగు మ్యాచ్‌‌ల్లో మాకు గట్టి పోటీ ఎదురుకానుంది. నా దృష్టిలో ప్రతి జట్టు మరో టీమ్‌‌తో పోటీపడటం గొప్ప. ఈ పరస్పర పోటీ వల్ల ప్రతి ఒక్కరు తొలి మ్యాచ్‌‌ నుంచే సత్తా చాటాలనుకుంటారు. మైదానంలోకి వెళ్లిన తొలి సెకండ్​ నుంచే ఒత్తిడిని అంచనా వేస్తున్నాం. ఏమాత్రం అప్రమత్తంగా లేకున్నా పరిస్థితులు చేజారిపోతాయి. కుదురుకోవడానికి సమయం కూడా ఉండదు. తొలి మ్యాచ్‌‌ నుంచే ప్రతి ఆటగాడు అత్యుత్తమమైన ఆటను చూపాలి. అందుకే ప్రతి ఒక్కరి కెరీర్‌‌లో వరల్డ్‌‌కప్‌‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. మేటి జట్లతో పోటీపడుతున్నాం కాబట్టి ఆరంభం నుంచే అధిక ఒత్తిడి, తీవ్రత ఉంటుంది. దీనిని అధిగమించడం కూడా మా ముందున్న అతిపెద్ద చాలెంజ్‌‌. ఒక్కో విజయంతో మేం టోర్నీలో ముందుకెళ్లాలి. ఒకసారి టాప్‌‌ ఫుట్‌‌బాల్‌‌ క్లబ్‌‌లను పరిశీలిస్తే.. ప్రీమియర్‌‌ లీగ్‌‌, లా లిగా టోర్నీల్లో మూడు, నాలుగు నెలలు తీవ్రత తగ్గకుండా మ్యాచ్‌‌లు ఆడుతాయి. అదే తీవ్రతను, నిలకడను ఈ టోర్నీలో మనమెందుకు చూపెట్టొద్దు?  ఇంగ్లండ్‌‌ పిచ్‌‌లు చాలా బాగుంటాయి. అక్కడ ఎండకాలం కావడంతో వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. ఫ్లాట్‌‌ వికెట్లపై మేం భారీ స్కోర్లనే ఊహిస్తున్నాం. అయితే ద్వైపాక్షిక సిరీస్‌‌లతో పోలిస్తే.. మెగా ఈవెంట్‌‌లో మ్యాచ్‌‌లు భిన్నంగా సాగుతాయి.  ఒత్తిడిని బట్టి 260, 270 స్కోరును కూడా చూడొచ్చు.  వాతావరణ పరిస్థితుల కంటే ఒత్తిడిని జయిస్తేనే మ్యాచ్‌‌ల్లో విజయం దక్కుతుందనేది వాస్తవం. ఇంగ్లండ్‌‌లో టెస్ట్‌‌లకు, వన్డేలకు పెద్ద తేడా ఉండకపోయినా ఆ రోజు ఒత్తిడిని అధిగమించిన జట్టే ముందుకెళ్తుంది.

కుల్దీప్‌‌, చహల్‌‌ కీలకం…

ఐపీఎల్‌‌లో అన్ని మ్యాచ్‌‌లు ఆడినా.. మా బౌలర్లందరూ తాజాగా ఉన్నారు. ఎవరూ అలసిపోయినట్లు కనిపించడం లేదు. వన్డేలకు సరిపోయే ఫిట్‌‌నెస్‌‌తో ఉండాలన్నదే ప్రతి ఒక్కరి లక్ష్యం. ఐపీఎల్‌‌కు ముందే ఈ విషయాన్ని అందరికీ చెప్పాం. మా బౌలింగ్‌‌ అటాక్‌‌లో కుల్దీప్‌‌, చహల్‌‌దే కీలక పాత్ర. ఐపీఎల్‌‌లో విఫలమైనా వరల్డ్‌‌కప్‌‌ ఆరంభానికి కుల్దీప్‌‌ గాడిలో పడతాడు. తప్పులను తెలుసుకున్నాడు కాబట్టి మరింత బలంగా, భిన్నంగా బౌలింగ్‌‌ చేస్తాడనే నమ్మకం ఉంది. చహల్‌‌, కుల్దీప్‌‌ కలిస్తే తిరుగుండదు. ఈ ఇద్దరు మా బౌలింగ్‌‌ లైనప్‌‌కు రెండు స్థంభాల వంటివారు. కేదార్‌‌ గాయం నుంచి కోలుకున్నాడు. ఇంగ్లండ్‌‌ పిచ్‌‌లపై అతను కచ్చితంగా ప్రభావం చూపుతాడు. అతని బ్యాటింగ్‌‌ గురించి ఆందోళన లేదు. టీ20ల్లో రన్స్‌‌ చేయకపోయినా.. వన్డేల్లో సత్తా చాటుతాడనే నమ్మకం ఉంది. పాకిస్థాన్‌‌తో మ్యాచ్‌‌ గురించి ఆలోచిస్తే ఇతర వాటిపై ఫోకస్‌‌ చేయలేం. ఈ టోర్నీలో ప్రతి మ్యాచ్‌‌ కీలకమే కాబట్టి అన్నింటిని సమానంగా తీసుకోవాలి.

సౌతాఫ్రికా (జూన్‌‌ 5)తో జరిగే తొలి మ్యాచ్‌‌తో మెగా ఈవెంట్‌‌ను మొదలుపెట్టనున్న టీమిండియా.. తర్వాత వరుసగా ఆస్ట్రేలియా (9న), న్యూజిలాండ్‌‌ (13న), పాకిస్థాన్‌‌ (16న)తో తలపడనుంది.