కండ్లలో కారం చల్లి, గొంతు నులిమి.. తల్లీకూతురు దారుణ హత్య

కండ్లలో కారం చల్లి, గొంతు నులిమి..  తల్లీకూతురు దారుణ హత్య
  • ఆస్తి గొడవల కారణంగా బంధువులే హత్య చేశారని అనుమానాలు
  • నల్గొండ జిల్లా అనుముల మండలంలో ఘటన


హాలియా, వెలుగు : తల్లీకూతురు దారుణహత్యకు గురైన ఘటన నల్గొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపేట గ్రామంలో ఆదివారం జరిగింది. ఆస్తి కోసం దగ్గరి బంధువులే హత్య చేశారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... ఇబ్రహీంపేట గ్రామానికి చెందిన రుద్రాక్ష సాయిలు, వెంకటమ్మ దంపతులకు కుమారుడు యాదయ్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. యాదయ్యకు భార్య సుమలత (45), కూతురు లావణ్య (20) ఉంది. సుమారు 18 ఏండ్ల కింద, లావణ్య వయస్సు ఆరు నెలలు ఉన్న సమయంలోనే యాదయ్య చనిపోయాడు. దీంతో సాయిలు తన భార్య వెంకటమ్మను గార్డియన్‌‌‌‌‌‌‌‌గా పెట్టి మనవరాలైన లావణ్య పేరున ఆరు ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ చేశాడు. కొంత కాలం తర్వాత వెంకటమ్మ తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆమెను కోడలు సుమలత, మనవరాలు లావణ్య పట్టించుకోకపోవడంతో కూతుళ్లే హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఇప్పించారు. సుమలత, లావణ్య ఆస్తి తీసుకొని వెంకటమ్మను పట్టించుకోవడం లేదంటూ ఆమె కూతుళ్లు కోర్టులో పిటిషన్‌‌‌‌‌‌‌‌ వేశారు. ఈ లోగా లావణ్యకు 18 సంవత్సరాలు కంప్లీట్ అయి, మేజర్‌‌‌‌‌‌‌‌ కావడంతో సాయిలు రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ చేసిన భూమి ఏకపక్షంగా పట్టా అయింది.

 ఈ క్రమంలోనే వెంకటమ్మ ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కోసం రూ. 30 లక్షలు ఖర్చు అయినందున రూ. 5 లక్షలు ఇవ్వాలని సుమలతను కోర్టు ఆదేశించింది. ఈ డబ్బుల గురించి వెంకటమ్మ కూతుళ్లు సుమలతను అడిగినా.. ఆమె ఒప్పుకోలేదు. ఈ విషయంపైనే ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా... ఆదివారం ఉదయం సుమలత, లావణ్య కలిసి గ్రామ శివారులో ఉన్న తమ పామాయిల్‌‌‌‌‌‌‌‌ తోటలో పనిచేసేందుకు వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత స్థానికులు అటువైపు వచ్చి చూసే సరికే ఇద్దరూ కిందపడిపోయి కనిపించారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. డాగ్‌‌‌‌‌‌‌‌స్క్వాడ్‌‌‌‌‌‌‌‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. గుర్తు తెలియని వ్యక్తులు తల్లీకూతుళ్ల కండ్లలో కారం చల్లిన అనంతరం గొంతు నులిమి హత్య చేసి ఉంటారని పోలీసులు గుర్తించారు. ఆస్తి గొడవల నేపథ్యంలో బంధువులే హత్య చేసి ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.