- పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి
ఇబ్రహీంపట్నం, వెలుగు: మద్యానికి బానిసైన కొడుకు బాగయితడని డీఅడిక్షన్ సెంటర్లో అడ్మిట్ చేస్తే.. కొట్టి చంపారని ఓ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని హౌజింగ్ బోర్డు కాలనీకి చెందిన రిటైర్డ్ టీచర్ మౌళి జాన్సీ లక్ష్మీబాయి కొడుకు చౌహన్ సంతోష్ పవన్ సింగ్ (29) మద్యానికి బానిసయ్యాడు. గత 6 నెలల క్రితం హైదరాబాద్ బీఎన్ రెడ్డి నగర్‌లోని డీ అడిక్షన్ సెంటర్లో చేర్చగా, ఆరోగ్యం మెరుగై ఇంటికి వచ్చాడు. మరల మద్యానికి బానిసైపోవడంతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగ్లూర్ రాఘవేంద్ర హోమ్స్‌లోని హైదరాబాద్ డీఅడిక్షన్ సెంటర్లో 3 రోజుల కింద అడ్మిట్ చేశారు.
ఆదివారం సాయంత్రం ఆరోగ్యం విషమించి వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.సెంటర్ నిర్వాహకులు సంతోష్ రెడ్డి, రాకేష్ రెడ్డి బ్రెయిన్ స్ట్రోక్ వల్ల మరణించాడని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే, ఒంటిపై గాయాలు ఉండడంతో బాధిత తల్లి ఆదిబట్ల పోలీసులను ఆశ్రయించింది.
ఇక్కడ మద్యం, గంజాయి బానిసలైన 15 మందికి ట్రీట్మెంట్ అందిస్తుండగా, తన కొడుకు కొట్టి చంపారని అనుమానిస్తూ ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవికుమార్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
