జైల్లో బండి సంజయ్ ను కలిసిన భార్య, పిల్లలు.. ఉద్వేగానికి గురైన అపర్ణ

జైల్లో బండి సంజయ్ ను కలిసిన భార్య, పిల్లలు.. ఉద్వేగానికి గురైన అపర్ణ

టెన్త్ పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయ్యి.. కరీంనగర్ జైలులో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను అతని భార్య అపర్ణ, కుమారుడు, బావ మరిది కలిశారు. ఏప్రిల్ 6వ తేదీ గురువారం ఉదయం.. ములాఖత్ కింద భార్య అపర్ణ దరఖాస్తు చేసుకోగా.. అనుమతి ఇచ్చారు అధికారులు. ఈ క్రమంలోనే జైలులో ఉన్న భర్తను కలిసి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. 

ములాఖత్ లో భాగంగాలో జైలులో ఉన్న భర్తను కలిసిన భార్య అపర్ణ.. ఉద్వేగానికి గురయ్యారు. అర్థరాత్రి ఇంటికొచ్చి బలవంతంగా తీసుకెళ్లిన సమయంలో.. ఆమె అక్కడే ఉన్నారు. 24 గంటల తర్వాత భర్తను జైలులో కలవటంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంపీ బండి సంజయ్ కు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి. గతంలో ఆయనకు గుండెకు చికిత్స జరిగింది. ఈ క్రమంలోనే తీసుకుంటున్న ట్యాబ్లెట్లు, ఆహారంపై వాకబు చేశారు భార్య అపర్ణ. 

ఇక తండ్రిని జైలులో చూసిన కుమారుడు సైతం ఉద్వేగానికి గురయ్యాడు. బండి సంజయ్ భార్య, పిల్లలను ఓదార్చారు. కుట్రపూరితంగానే జైలులో పెట్టారని.. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని కుటుంబానికి దైర్యం చెప్పారు ఎంపీ బండి సంజయ్..