 
                                    - అందుకే అజారుద్దీన్‌కు మంత్రిపదవి రాకుండా యత్నం: ఎంపీ చామల ఫైర్
హైదరాబాద్, వెలుగు: మైనార్టీలంటే బీజేపీ, బీఆర్ఎస్‌కు విపరీతమైన ద్వేషమని, అందుకే అజారుద్దీన్‌కు మంత్రిపదవి రాకుండా ఈ రెండు పార్టీలు కుట్రపన్నాయని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గురువారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణ కేబినెట్‌లో మైనార్టీ మంత్రి ఉండొద్దా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండకూడదనే దుర్బుద్ధితోనే బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్ర చేస్తున్నాయని, అందులో భాగంగానే ఆ రెండు పార్టీలు ఏకమయ్యాయన్నారు.
ఈ విషయాన్ని స్వయంగా కేసీఆర్ కూతురు కవితే చెప్పారని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆ పార్టీలు వ్యవహరిస్తున్న తీరు చూసినా, గత ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు సున్నా సీట్లు వచ్చిన విషయంపై విశ్లేషణ చేసినా ఆమె మాటల్లో నిజం ఉందనిపిస్తోందన్నారు. కాంగ్రెస్‌ను ఓడగొట్టడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని, అయినా కంటోన్మెంట్ ఫలితాలు ఇక్కడా పునరావృతం అవుతాయన్నారు.

 
         
                     
                     
                    