ప్రజా పాలనలో కేటీఆర్, హరీశ్‌ భాగస్వాములు కావాలి : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

ప్రజా పాలనలో కేటీఆర్, హరీశ్‌ భాగస్వాములు కావాలి : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
  • కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో ప్రతిపక్ష నేతలు కేటీఆర్, హరీశ్‌రావు భాగస్వాములు కావాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రతిపక్ష హోదాలో తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. గత రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై ప్రజల అభిప్రాయాలను నేరుగా తెలుసుకునేందుకే సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు.

సీఎం తీసుకున్న ఈ మంచి నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కేటీఆర్, హరీశ్‌రావు కూడా చొరవ చూపాలని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజా పాలన కార్యక్రమానికి లభిస్తున్న అనూహ్య ఆదరణ చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నేతలు కుట్రలకు పాల్పడుతున్నారని చామల విమర్శించారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు, నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ‘‘ఫామ్‌హౌజ్ పాలనను ప్రజలు ఎప్పుడో పాతరేశారు. ఇప్పటి ప్రజా పాలనను ప్రజలు ఆదరిస్తుంటే కేటీఆర్, హరీశ్‌ తట్టుకోలేకపోతున్నారు’’ అని ఆయన విమర్శించారు.