హైదరాబాద్, వెలుగు:హైదరాబాద్ పాతబస్తీ నుంచి హిందువులను తరిమేసేందుకు కాంగ్రెస్, ఎంఐఎం కలిసి కుట్ర పన్నుతున్నాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. టీడీపీ వాళ్లు సీఎంలు అయితే ఇలాగే ఉంటుందని, కేసీఆర్, రేవంత్ హయాంలో దేవాలయాలపై దాడులు పెరిగాయని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో అర్వింద్ మీడియాతో మాట్లాడారు. పురానాపూల్‌లో కర్ఫ్యూ వాతావరణం ఉండడం సీఎం రేవంత్‌కు సిగ్గుచేటని విమర్శించారు.
రేవంత్ అన్నీ దొంగ వ్యాపారాలే చేస్తాడనీ.. మళ్లీ హిందూ దేవుళ్ల మీద ఒట్లు వేస్తాడని.. దమ్ముంటే అల్లా మీద ఒట్టు వేయాలని సవాల్ విసిరారు. కేసీఆర్ చేసిన అతిపెద్ద తప్పు కుటుంబాన్ని రాజకీయాల్లోకి తేవడమేనని అన్నారు. ‘‘మేం గాలివాటమా? కాదా? అని మీ చెల్లిని అడుగు కేటీఆర్. రోజూ మీ చెల్లె.. నీది, మీ అయ్యది తోలు తీస్తున్నది. నీకు దమ్ముంటే నిజామాబాద్ రా.. బీజేపీ ఎక్కడుందో చూపిస్తా. మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్‌కు వస్తావా? నా సవాల్‌కు సిద్ధమా?" అని కేటీఆర్‌కు చాలెంజ్ చేశారు.
