- ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయాన్ని బజార్లోకి తెచ్చారు
- మంత్రులు వివేక్, పొన్నం పనితీరు వల్లే ఆర్టీసీ సమస్య పరిష్కారమైందని వెల్లడి
- పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో ఎంపీ పర్యటన
పెద్దపల్లి/ కోల్‌బెల్ట్, వెలుగు: కవిత ఏర్పాటు చేసిన కొత్త పార్టీతో బీఆర్ఎస్‌కు మాత్రమే నష్టమని.. కాంగ్రెస్‌కు ఎలాంటి నష్టం ఉండదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. కేటీఆర్ అహంకారం వల్లే కవిత పార్టీ పెట్టారన్నారు. ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయాన్ని కేటీఆర్ బజార్‌లోకి తేవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. బీఆర్‌ఎస్ అయినా.. టీఆర్ఎస్ అయినా ప్రజలకు ఎలాంటి లాభం ఉండదన్నారు.
ఆదివారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన ఎంపీకి పార్లమెంటు కార్యాలయంలో ప్రజలు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కారానికి కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి చేశారన్నారు. కార్మికుల సమస్యలను రెండ్రోజుల్లో పరిష్కరించి సమ్మె విరమించేలా చేశారని, కార్మికులకు భరోసా కల్పించారని పేర్కొన్నారు.
గతంలో ఆర్టీసీ కార్మికులు దాదాపు 50 రోజులు సమ్మె చేసినా ఆనాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. గతంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కాకా వెంకటస్వామి కార్మికుల కోసం అనేక స్కీమ్‌లు తెచ్చారని, ఇప్పటికీ వాటి ఫలితాలు కార్మికులు పొందుతున్నారని తెలిపారు. అనంతరం పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఆర్చ్‌ని ఎంపీ ప్రారంభించి, మాట్లాడారు. గ్రామాభివృద్ధికి గ్రామ ప్రవేశ ద్వారాలు ప్రతీకగా నిలుస్తాయన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు, రహదారులు, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో మరింత పురోగతి సాధించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
స్వంత నిధులతో ఆర్చిని నిర్మించిన రామ్, అఖిల్‌ను ఎంపీ అభినందించారు. ఈ కార్యక్రమాల్లో సయ్యద్ సజ్జాద్, బండారు సునీల్, యాంకర్ రవి, నరేష్ నానీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కమాన్‌పూర్ మండలం ముల్కలపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్, వినీల వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
- పదేండ్లలో బీఆర్ఎస్ ఒక్క ఇల్లు ఇయ్యలే..
బీఆర్‌ఎస్ హయాంలో పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, కేసీఆర్, కేటీఆర్ మాత్రం ఫాం హౌస్‌లు కట్టుకున్నారని ఎంపీ వంశీకృష్ణ విమర్శించారు. పేదలకు సొంత గూడు ఇవ్వలేనందుకు కేసీఆర్, కేటీఆర్ సిగ్గుపడాలన్నారు.
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం పొన్నారం గ్రామానికి చెందిన నెల్లివెల్లి స్రవంతి-- వినీత్ కట్టుకున్న ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. పొన్నారం గ్రామంలో 226 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, నిర్మాణం పూర్తి చేసుకొని గృహ ప్రవేశంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.
పేద కుటుంబాలకు గౌరవప్రదమైన నివాసాన్ని అందించాలనే రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా పేదలకు సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కేటాయిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందేలా చొరవ చూపాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

