నా బంగ్లా కూల్చినోళ్లను మహారాష్ట్ర నుంచి వెళ్లగొట్టారు: థాక్రే ఫ్యామిలీపై ఎంపీ కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు

నా బంగ్లా కూల్చినోళ్లను మహారాష్ట్ర నుంచి వెళ్లగొట్టారు: థాక్రే ఫ్యామిలీపై ఎంపీ కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: బృహన్ ముంబై మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం సాధించడంతో నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఘాటుగా స్పందించారు. బాంద్రా వెస్ట్‎లోని తన బంగ్లాను బీఎంసీ కూల్చివేసిన ఘటనను గుర్తు చేసుకున్నారు. అప్పటి ఉద్ధవ్ థాకరే పాలనపై విమర్శలు గుప్పించారు.  ‘‘నన్ను దూషించిన వాళ్లు, నా ఇంటిని కూల్చివేసిన వాళ్లు, మహారాష్ట్ర నుంచి విడిచిపోవాలని నన్ను బెదిరించిన వాళ్లకు ప్రజలు సరైన స్థానం చూపించారు. 

మహారాష్ట్ర వాళ్లను వదిలివేసింది. మహిళలను ద్వేషించే వాళ్లు, భయపెట్టేవాళ్లు, నెపోటిజం మాఫియాకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు. వారికి సరిగ్గా సమాధానం చెప్పారు” అని పేర్కొన్నారు.  స్థానిక ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు ఆమె శుభాకాంక్షలు చెప్పారు.

జైల్లో ఉన్న అత్తాకోడళ్ల గెలుపు

పుణె మున్సిపల్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ ఎన్నికల్లో స్థానిక గ్యాంగ్‌‌‌‌ స్టర్‌‌‌‌ బందు అందేకర్‌‌‌‌ బంధువులు సోనాలి, లక్ష్మి విజయం సాధించారు. వరుసకు అత్తాకోడళ్లు అయిన వీరిద్దరూ ప్రస్తుతం ఆ గ్యాంగ్‌‌‌‌ స్టర్‌‌‌‌ మనవడి హత్య కేసులో జైల్లో ఉన్నారు. బీఎంసీ ఎన్నికల్లో డిప్యూటీ సీఎం అజిత్‌‌‌‌ పవార్‎కు చెందిన ఎన్సీపీ వీరిద్దరికి రెండు స్థానాల్లో కార్పొరేటర్‌‌‌‌ టికెట్లు ఇచ్చింది. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో వీరిద్దరూ 23వ వార్డు నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. గ్యాంగ్‌‌‌‌ స్టర్‌‌‌‌ బందు అందేకర్‌‎కు సోనాలి కోడలు కాగా.. లక్ష్మి అతడికి మరదలి వరుస అవుతారు. 

షిండే నివసించే వార్డులో ఉద్ధవ్ అభ్యర్థి గెలుపు

థానే మున్సిపల్ కార్పొరేషన్‌‏లో డిప్యూటీ సీఎం ఏక్‌‌‌‌ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, ఆయన నివసించే 13వ వార్డులో మాత్రం ఆ పార్టీ అభ్యర్థి ఓడిపోయారు. షిండే ఇల్లు 13ఏ వార్డులో ఉన్నది. ఇక్కడ శివసేన నుంచి మాజీ మేయర్ అశోక్ వైటి పోటీ చేయగా.. శివసేన (యూబీటీ) నుంచి షాజీ ఖుస్పే బరిలోకి దిగారు. అశోక్ వైటిని షాజీ ఖుస్పే 600కిపైగా ఓట్ల తేడాతో ఓడించారు.