అవసరమైతే పొన్నంకు నా స్థానమిస్త: కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

అవసరమైతే పొన్నంకు నా స్థానమిస్త: కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి
  • ఎన్నికల కమిటీలో చోటు దక్కకపోవడంపై కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి
  • టీఆర్టీ అభ్యర్థుల తరఫున 48 గంటల దీక్ష చేస్త అని కామెంట్​

హైదరాబాద్​, వెలుగు: అధికార పార్టీ నేతలు దళితబంధులో 30 శాతం, బీసీలకు ఆర్థిక సాయంలో 40 శాతం కమీషన్లు దండుకుంటున్నారని కాంగ్రెస్​ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్​ అవినీతిపై పోరాటం ఉధృతం చేస్తామన్నారు. ఆదివారం పీఏసీ (రాజకీయ వ్యవహారాల కమిటీ) సమావేశం సందర్భంగా గాంధీభవన్​కు వచ్చిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. పీఏసీ ఏర్పడ్డాక తొలిసారి మీటింగ్​కు వస్తున్నానని ఆయన చెప్పారు. ఎన్నికల కమిటీలో పొన్నం ప్రభాకర్​కు చోటు దక్కకపోవడంపై వెంకట్​రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే తన పేరును తొలగించి పొన్నంకు ఇవ్వాల్సిందిగా కోరుతానని చెప్పారు. మరోవైపు పీఏసీలో కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి సభ్యుడు కాకపోయినా మీటింగ్​కు రావడం గమనార్హం. 

టీఆర్టీ అభ్యర్థుల తరఫున దీక్ష చేస్త

ఏండ్లు గడుస్తున్నా టీఆర్టీ పెట్టట్లేదంటూ సర్కార్​పై వెంకట్​రెడ్డి ఫైర్​ అయ్యారు. ఈ అంశంపై ఇప్పటికే సీఎం కేసీఆర్​కు తాను లేఖ రాశానని, అయినా స్పందన రాలేదని అన్నారు. టీఆర్టీ అభ్యర్థుల తరఫున పోరాటం చేస్తానని, ఇందిరాపార్క్​ వద్ద 48 గంటల దీక్ష, ధర్నా చేసి నిరుద్యోగులకు అండగా ఉంటానని చెప్పారు. ఆదివారం కోమటిరెడ్డిని తన నివాసం వద్ద టీఆర్టీ అభ్యర్థులు కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ బడుల్లో వేలాది టీచర్​ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. దాంతో పేద విద్యార్థులకు సరైన విద్య అందట్లేదని పేర్కొన్నారు. టీచర్​ ఉద్యోగాల కోసం 4 లక్షల మందికిపైగా అభ్యర్థులు కోచింగ్​ తీసుకున్నారన్నారు. ఏండ్లు గడుస్తున్నా నోటిఫికేషన్​ ఇచ్చేందుకు కేసీఆర్​కు ఎందుకు మనసొప్పడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్​ ఉండే ఈ 4 నెలల్లో టీఆర్టీ నోటిఫికేషన్​ రాకుంటే.. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన నెలలోపే నోటిఫికేషన్​ వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. తానిచ్చిన మాట ప్రకారం నోటిఫికేషన్​ రాకుంటే.. తెలంగాణ కోసం రాజీనామా చేసినట్టే టీఆర్టీ అభ్యర్థుల కోసం కూడా రాజీనామా చేస్తానన్నారు. తమ ప్రభుత్వంలో ఎవరు సీఎంగా ఉన్నా తొలి ప్రాధాన్యం మాత్రం విద్యకే ఉంటుందని స్పష్టం చేశారు. తన తాత చేస్తున్న నిర్లక్ష్య పాలనపై హిమాన్షు చక్కగా వివరించాడని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. స్కూళ్ల విషయంలో ఏపీ సీఎం జగన్​మోహన్​రెడ్డిని చూసి కేసీఆర్​ నేర్చుకోవాలన్నారు.