నల్గొండ నుంచే పోటీ చేస్తా :  కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి

నల్గొండ నుంచే పోటీ చేస్తా :  కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి

నల్లగొండ జిల్లా : వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తారో క్లారిటీ ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను నల్గొండ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పారు. ఏప్రిల్ 28వ తేదీన నల్గొండలో నిర్వహించే నిరుద్యోగ దీక్ష గురించి తనకు తెలియదన్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర సందర్భంగా జూన్ మొదటి వారంలో నల్గొండలో సభ నిర్వహిస్తామని, ఈ సభకు ప్రియాంక గాంధీ హాజరవుతారని చెప్పారు. 

సీఎం కేసీఆర్ ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు పెంచాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. నల్గొండను దత్తత తీసుకున్న కేసీఆర్ ముస్లింలు, దళితులు, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టించి..ఇవ్వాలని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తాను 20 ఏళ్లుగా నిజాయితీగా పని చేసి.. నల్గొండను అభివృద్ధి చేశానని, ఆపదలో ఉన్నవారందరికీ సేవ చేశానని చెప్పారు.