
- కేసీఆర్, కేటీఆర్.. మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మరు : లక్ష్మణ్
- రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే : లక్ష్మణ్
- నాలుగు కోట్ల పేదలకు కేంద్రం ఇండ్లు ఇచ్చింది
- తెలంగాణలో లక్ష ఇండ్లు కూడా ఇవ్వలేదని విమర్శ
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మరని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శించారు. సర్వే రిపోర్టులు పట్టించుకోబోమని, తెలంగాణ ప్రజలపైనే తమకు నమ్మకం ఉందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం 100 రోజుల రోడ్‌మ్యాప్ సిద్ధం చేశామని వివరించారు. రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది అవినీతి రహిత, కుటుంబ రహిత బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. గురువారం బీజేపీ హెడ్ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సామాజికంగా ప్రజాదరణ పొందిన బీజేపీ గెలుపు గుర్రాలను ఎన్నికల బరిలోకి దింపుతున్నామని తెలిపారు. కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే అనే విషయాన్ని ప్రజలు కూడా నమ్ముతున్నారన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే.. అది బీఆర్ఎస్కే పోతుందని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపించినా.. కారు పార్టీలో చేరుతారని విమర్శించారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 4 కోట్ల పేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తే.. తెలంగాణలో కేవలం లక్ష ఇండ్లు కూడా ఇవ్వలేకపోయారని ఫైర్ అయ్యారు. సొమ్ము ఒకరిది, సోకొకరిది అన్నట్లు.. ఇండ్ల నిర్మాణానికి కేంద్రం నిధులిస్తే, బీఆర్ఎస్ సర్కార్ ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు.
ట్విట్టర్ టిల్లు స్పందించాలి
తెలంగాణ, ఏపీకి రైల్వే లైన్లు కేటాయిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైందని లక్ష్మణ్ అన్నారు. తెలంగాణలో 433.82 కిలో మీటర్ల రైల్వే డబ్లింగ్ లైన్‌కు ఆమోదం తెలిపినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గుజరాత్ కే పరిమితమైందని విమర్శించే కేసీఆర్, కేటీఆర్ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు. ట్విట్టర్ టిల్లు (కేటీఆర్) రైల్వే ప్రాజెక్టుల గురించి స్పందించాలని డిమాండ్ చేశారు. టీమిండియా స్ఫూర్తితో అన్ని రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తున్నదన్నారు.
సెప్టెంబర్ 17న ప్రజల్లోకి తీసుకెళ్తాం
ఓబీసీల సంక్షేమం, అభివృద్ధి, ఆయా వర్గాలను ఆదుకునేందుకు రూ.13వేల కోట్లతో పీఎం విశ్వకర్మ స్కీమ్ కేంద్రం తీసుకొచ్చిందన్నారు. సెప్టెంబర్ 17న విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని ఈ స్కీమ్‌ను మోదీ ప్రారంభిస్తారని తెలిపారు. అదే రోజు ఓబీసీ మోర్చా ఈ స్కీమ్‌ను బీసీ వర్గాల్లోకి తీసుకెళ్తుందన్నారు. ఈ స్కీమ్‌లో 18 చేతివృత్తులు, కుల వృత్తుల వారికి పీఎం విశ్వకర్మ సర్టిఫికెట్ తో పాటు ఐడీ కార్డు ఇస్తామన్నారు. మొదటి విడత 5 శాతం వడ్డీతో లక్ష రూపాయలు, రెండో విడత రెండు లక్షల వరకు రుణ సాయం అందజేస్తామన్నారు. ఇండియా కూటమిలో ఉన్నది అవినీతి, అహంకార, వాసరత్వ పార్టీలని విమర్శించారు.