విచారణకు సహకరిస్తానని చెప్పి కవిత తప్పించుకునుడేంది?

విచారణకు సహకరిస్తానని చెప్పి కవిత తప్పించుకునుడేంది?

న్యూఢిల్లీ, వెలుగు:  ఈడీ విచారణను ఎదుర్కొని నిర్దోషిత్వాన్ని కవిత నిరూపించుకోవాలని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. ‘‘ఈడీ నోటీసులు జారీ చేసినప్పుడు విచారణకు సహకరిస్తామని కవిత చెప్పారు. కానీ ఇప్పుడు ఆమె చేస్తున్న తప్పించుకునే మార్గాలను ప్రజలు గమనిస్తున్నారు. తప్పు చేసిన వారు తప్పించుకునే మార్గాలు వెతుకుతారు. తప్పు చేయనప్పుడు విచారణకు భయపడాల్సిన అవసరం లేదు. గతంలో అనేకమంది రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు కూడా ఈడీ విచారణ ఎదుర్కొన్నారు” అని ఆయన తెలిపారు. అవినీతి కేసుల మూసివేతలో తెలంగాణ ఏసీబీ నెంబర్ వన్ గా ఉందని విమర్శించారు. ఈ విషయాన్ని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ఇటీవల విడుదల చేసిన ‘క్రైం ఇండియా’ రిపోర్టులో వెల్లడించిందన్నారు.

గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో లక్ష్మణ్​ మీడియాతో మాట్లాడారు. రాజకీయ అవసరాల కోసం ఏసీబీ, పోలీసులు, ఇంటెలిజెన్స్ ను వాడుకోవడం బీఆర్ఎస్ సర్కార్​కు పరిపాటి అయిందని ఆరోపించారు. స్పెషల్ ఇన్వెస్ట్ గేషన్ టీం(సిట్) అంటే తెలంగాణలో పర్మినెంట్ పెండింగ్ అని విమర్శించారు. సిట్ దర్యాప్తు ప్రారంభించిన నయీం కేసు, డ్రగ్స్ కేసు, డేటా చోరీ కేసులు ఏమయ్యాయని ప్రశ్నించారు. నయీం కేసులో.. నయీం డైరీ, భూముల కబ్జాలు, కిడ్నాపులు, బంగారం అంటూ సిట్ పెద్ద హడావుడి చేసిందని, చివరికి ఆ డైరీ ఎటుపోయిందో తెలియదని ఎద్దేవా చేశారు. డ్రగ్స్ కేసులోనూ అంతే అని విమర్శించారు.  కేసీఆర్ సర్కార్ లీకుల సర్కార్ గా మారిపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇంత పెద్ద స్కామ్​ జరిగితే కేవలం ఇద్దరు చిన్న పాటి ఉద్యోగులను అరెస్ట్ చేసి, ప్రభుత్వం చేతులు దులుపుకుందని, ఈ వ్యవహారంలో తెరవెనక ఉన్న పెద్ద తలకాయల బండారం బయటపెట్టాలన్నారు.