
- పెండింగ్ నిధులపై ప్రధాని మోదీకి ఎంపీ మల్లు రవి లేఖ
న్యూఢిల్లీ, వెలుగు: విభజన చట్టం –2014లో పొందుపరిచినట్లు తెలంగాణలోని వెనకబడిన తొమ్మిది జిల్లాలకు రావాల్సిన రూ.1800 కోట్ల పెండింగ్ నిధుల్ని తక్షణమే రిలీజ్ చేయాలని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన లేఖ రాసారు. తర్వాత ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మల్లు రవి మీడియాతో మాట్లాడారు. విభజన చట్టంలో సెక్షన్ 94(2) ప్రకారం.. ఆనాటి 10 జిల్లాల్లో హైదరాబాద్ మినహా 9 జిల్లాలను వెనకబడిన ప్రాంతాలుగా కేంద్రం గుర్తించిందని చెప్పారు.
వీటి అభివృద్ధికి జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున మొత్తం ఏడాది రూ. 450 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉందన్నారు. అయితే 2019–20, 2021–22, 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరాలకు గాను మొత్తం రూ.1800 కోట్లు పెండింగ్ లో ఉన్నట్లు వివరించారు. ఈ నిధుల్ని వెంటనే రిలీజ్ చేయాలని, అలాగే విభజన చట్టంలోని ఇతర హామీల అమలుపై కేంద్ర దృష్టి సారించాలని కోరారు.
కేసీఆర్ కు హరీశ్ భయం పట్టుకుంది
అల్లుడు హరీశ్ రావు తన పార్టీకి, పదవికి ఎక్కడ ఎసరు పెడతాడోనని కేసీఆర్ భయపడుతున్నారని మల్లు రవి అన్నారు. అందుకే ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిగా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ సీఎంగా ప్రజల్లో ఉండాల్సింది పోయి.. ఫామ్ హౌస్ కు పరిమితమై రాజకీయ శూన్యతను ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ప్రజలు మూడోసారి అధికారం ఇవ్వలేదన్న కోపం, అవినీతికి పాల్పడ్డ బిడ్డకు బెయిల్ రాలేదన్నా ఆక్రోశం, మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతన్న కొడుకు కేటీఆర్ ను చూసి ఆయన అయోమయ స్థితిలో ఉన్నారన్నారు.
కనీసం స్వాతంత్య్ర దినోత్సవం రోజు పార్టీ ఆఫీసుకు, గజ్వెల్ కలెక్టరేట్, అసెంబ్లీకి ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో పడుకున్నాడంటే ఆయన మానసికస్థితి ఎలా ఉందో అర్థమవుతుందని అన్నారు.