దేశ స‌మ‌గ్రత‌కు నూత‌న ప‌రిజ్ఞానం అవ‌స‌రం..ఐరాసలో భారత్ వాదన వినిపించిన ఎంపీ మిథున్ రెడ్డి

దేశ స‌మ‌గ్రత‌కు నూత‌న ప‌రిజ్ఞానం అవ‌స‌రం..ఐరాసలో భారత్ వాదన వినిపించిన ఎంపీ మిథున్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: ఐక్యరాజ్యసమితి వేదికగా వైఎస్సార్‌సీపీ ఎంపీ పి.వి. మిథున్ రెడ్డి భారతదేశ వాదనను వినిపించారు. ఐరాస ఆరో కమిటీ (లీగల్) సమావేశంలో ఆయన అంతర్జాతీయ న్యాయ కమిషన్ నివేదికపై భారత్ తరపున అధికారిక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులకు ఉండే మినహాయింపులకు సంబంధించిన ముసాయిదా నిబంధనలపై దేశానికి ఉన్నటువంటి అభ్యంతరాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ మినహాయింపు వ్యక్తిగతమైనది కాదని, అది దేశ సార్వభౌమత్వానికి సంబంధించినదని స్పష్టం చేశారు. 

ఒక దేశం మరో దేశ అధికారిపై క్రిమినల్ అధికార పరిధిని వినియోగించే క్రమంలో ‘దుర్వినియోగాలు, రాజకీయం చేయడం’ వంటి వాటికి వ్యతిరేకంగా బలమైన రక్షణలు ఉండాలని భారత్ తరఫున డిమాండ్ చేశారు. అదే సమయంలో సముద్రపు దొంగలు, ప్రైవేట్ ఆర్మీ కట్టడికి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశారు. సముద్ర దొంగతనాలు, సాయుధ దోపిడీ నివారణ విషయంలో కాలానికి అనుగుణంగా చట్టాలు ఉండాలన్నారు. ‘కొత్త సాంకేతిక పరిజ్ఞానాల ఉపయోగం, ప్రైవేట్ సాయుధ భద్రత పాత్ర’ వంటి అభివృద్ధి చెందుతున్న సవాళ్లపై కమిషన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు