మెదక్ టౌన్, వెలుగు: మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. గురువారం జిల్లా పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మెదక్ అభివృద్ధి విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి మెదక్ కు చేసిందేమీలేదని విమర్శించారు.
మెదక్ నగర పంచాయతీగా ఉన్నప్పుడు ఎలా ఉందో మున్సిపాలిటీగా మారిన తర్వాత సైతం అదే విధంగా ఉందన్నారు. తన మామ మెప్పు కోసం మాజీ మంత్రి హరీశ్‌రావు 20 వేల జనాభా లేని గజ్వేల్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వేయించారని దుయ్యబట్టారు. మెదక్ జిల్లా ఏర్పడిన పదేళ్లలో రింగురోడ్డు లేదు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు లేవన్నారు. పదేళ్లలో అప్పటి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు చేయని అభివృద్ధిని కేవలం ఏడాదిన్నర కాలంలో తాను చేసి చూపానన్నారు.
రూ. 950 కోట్లు మార్చి లోపు వెనక్కి వెళ్లనున్నందున ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ఆరాటపడుతోందన్నారు. సమావేశంలో బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి నర్సింహారెడ్డి, బీజేపీ మాజీ జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాస్, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కాశీనాథ్, సీనియర్ నాయకులు విజయ్‌కుమార్, నందారెడ్డి, రాంచరణ్, ఆయా మోర్చాల బాధ్యులు సతీశ్, వీణ, సంగీత, నాయిని ప్రసాద్, ప్రభాకర్ పాల్గొన్నారు.
కవిత కొత్త పార్టీ పెడతారని మొదట చెప్పింది నేనే
నర్సాపూర్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెడతారని మొదట చెప్పింది తానేనని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. గురువారం నర్సాపూర్‌లో నిర్వహించిన బీజేపీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కవిత పార్టీ పెట్టి, విధి విధానాలు ప్రకటిస్తే ఎవరికి నష్టం అనేది తెలుస్తుందన్నారు. దేశంలో 621 పార్టీలు రిజిస్టర్ అయి ఉన్నాయని, చెల్లెలు కొత్త పార్టీ పెడితే స్వాగతిస్తామని చెప్పారు. ఆమె రోజూ పేపర్లు, టీవీల్లో రావడానికి చాలా కష్టపడుతారని ఎద్దేవా చేశారు.
తొమ్మిదిన్నర ఏండ్ల బీఆర్ఎస్ పాలన, రెండేండ్ల ఇందిరమ్మ రాజ్యంలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పార్టీలు మారడం తప్ప చేసిందేమీలేదన్నారు. ప్రజల అభ్యున్నతికి బీజేపీ పాటుపడుతుందని, నర్సాపూర్ మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు మల్లేశ్ గౌడ్, నాయకులు ఆంజనేయులు పాల్గొన్నారు.
