న్యూఢిల్లీ: అమెరికాతో కుదుర్చుకున్న ట్రేడ్ డీల్‌తో భారత్‌కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కు మోదీ సర్కారు హోల్ సేల్‌గా సరెండర్ అయిందన్నారు. ట్రేడ్ డీల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం భారత మాతను అమ్మేసిందని, అందుకోసం సిగ్గుపడాలని ఫైర్ అయ్యారు.
బుధవారం లోక్ సభలో కేంద్ర బడ్జెట్ పై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. దేశ రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ పడ్డారని, దేశ ఇంధన భద్రతను అమెరికా చేతుల్లో పెట్టారని మండిపడ్డారు. అమెరికాలో ఓ బిజినెస్ మాన్ పై కేసు ఉందని, దాంతో బీజేపీ ఆర్థిక మూలాలు కదిలిపోయే పరిస్థితి వస్తుందనే ఇలా ట్రంప్‌కు మోదీ లొంగిపోయారని ఆరోపించారు.
‘‘ఈ ట్రేడ్ డీల్‌ను సమర్థించడానికి మీరు సభకు ఎలా వచ్చారు..? మీరు అమెరికాకు ధారాదత్తం చేస్తున్న వాటి గురించి సిగ్గు అనిపించడం లేదా..? మీరు ఇండియాను అమ్మేశారు. భారత మాతను అమ్మేయడం పట్ల సిగ్గు పడాలి. ఇది కేవలం ప్రధాని మోదీ సరెండర్ కావడమే కాదు.. మొత్తం 150 కోట్ల మంది భారతీయుల భవిష్యత్తును ఆయన సరెండర్ చేశారు” అని రాహుల్ విమర్శించారు.
‘‘అమెరికా ప్రవేశంతో మన చిన్న సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతారు. మోదీ తీసుకున్న ఇలాంటి నిర్ణయాన్ని గతంలో ఏ ప్రధాన మంత్రీ తీసుకోలేదు. భవిష్యత్తులోనూ ఎవరూ తీసుకోబోరు. ఈ డీల్ వల్ల రైతుల ప్రయోజనాలపై రాజీ పడాల్సి వస్తుంది. టెక్స్ టైల్స్ రంగం తుడిచిపెట్టుకుపోతుంది”అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇండియా కూటమి సర్కారు ఉండి ఉంటే..
ప్రస్తుతం కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం గనక ఉండి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని రాహుల్ అన్నారు. ‘‘ఇండియా కూటమి సర్కారు ఉంటే.. ముందుగా ఇండియాను సమాన స్థాయిలో చూడాలని, సర్వెంట్‌గా కాదని ట్రంప్‌కు తేల్చి చెప్పేది. ఎనర్జీ సెక్యూరిటీపై బేరసారాలకు తావులేదని స్పష్టం చేసేది. మేం దేశ రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టబోమని చెప్పేది. అలాగే ఇండియాను పాకిస్తాన్‌తో సమానంగా ట్రీట్ చేయొద్దని తెలియజేసేది. పాక్ ఆర్మీ చీఫ్‌కు ట్రంప్ బ్రేక్ ఫాస్ట్‌పై ఏదో ఒకటి చెప్పేది”అని ఆయన అన్నారు.
‘‘యుద్ధాల శకం ముగిసిందని కొన్నాళ్ల క్రితం ప్రధాని మోదీ, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ అన్నారు. కానీ, మనం యుద్ధాల కాలంలోకి అడుగుపెడుతున్నాం. ఉక్రెయిన్‌లో, గాజాలో, మిడిల్ ఈస్ట్ లో యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్ కు యుద్ధం పేరుతో బెదిరింపులు వస్తున్నాయి. మనం ఆపరేషన్ సిందూర్ చేపట్టాం. మనం ప్రమాదకరమైన ప్రపంచంలోకి వెళ్తున్నాం. మన బలాలను మనం అర్థం చేసుకోవాలి. మన దేశ ప్రజలే మన ప్రధాన బలం అని గుర్తించాలి. దేశ ప్రజలను, డేటాను, ఫుడ్ సప్లై, ఎనర్జీ సిస్టమ్ ను మనం కాపాడుకోవాలి”అని రాహుల్ స్పష్టం చేశారు.
మన చమురు కొనుగోళ్లు అమెరికా చేతిలో..
అమెరికాతో ట్రేడ్ డీల్ వల్ల దేశ ఇంధన భద్రత ప్రమాదంలో పడుతుందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. మనం ఎవరి నుంచి క్రూడ్ ఆయిల్ కొనాలన్నది మన ప్రధాని కాకుండా ఇకపై అమెరికా ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తారన్నారు. ఇండియా ఏ దేశం నుంచి క్రూడ్ ఆయిల్ కొంటుందో అమెరికా పర్యవేక్షిస్తుందని, వాళ్లు వద్దని చెప్పిన దేశాల నుంచి కొంటే టారిఫ్ లను 50 శాతానికి పెంచుతుందన్నారు.
‘‘మొదట్లో ఇండియాపై అమెరికా టారిఫ్ లు యావరేజ్ గా 3 శాతం ఉండేవి. కానీ ఇప్పుడు 18 శాతానికి పెరిగాయి. అమెరికాపై మన టారిఫ్ లు 16 శాతం ఉండేవి. ఇప్పుడు జీరోకు పడిపోతాయి. అంతేకాదు.. ఈ ట్రేడ్ డీల్ వల్ల ఇండియాలోకి అమెరికా దిగుమతులు 46 బిలియన్ డాలర్ల నుంచి 146 బిలియన్ డాలర్లకు పెరుగుతాయి. మరోవైపు అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల ఇంధనం, టెక్ ఉత్పత్తులను ఇండియా కొనాలి. ఇది ఏమాత్రం హేతుబద్ధంగా లేదు. మనం వాళ్ల ముందు ఫూల్స్ లా నిలబడ్డాం”అని రాహుల్ అన్నారు.
కాగా, రాహుల్ మాట్లాడుతుండగా అధికార పక్ష సభ్యులు పదే పదే అడ్డు తగిలారు. రాహుల్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, వాటికి ఆధారాలు చూపాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు డిమాండ్ చేశారు. ఆధారాలు చూపేందుకు సిద్ధంగా ఉన్నానని రాహుల్ వారికి బదులిచ్చారు. అమెరికాలో ఓ బిజినెస్ మాన్ పై కేసు ఉందని రాహుల్ ప్రస్తావించగా.. స్పీకర్ చైర్ లో ఉన్న జగదంబికా పాల్ స్పందిస్తూ.. సభలో సభ్యులు కాని వ్యక్తుల గురించి ప్రస్తావించవద్దని వారించారు.
