మున్నూరు కాపులందరం ఐక్యంగా సాగుదాం : ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్యే దానం

మున్నూరు కాపులందరం ఐక్యంగా సాగుదాం : ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్యే దానం
  • కోకాపేటలో మున్నూరు కాపు ఆత్మగౌరవ భవనానికి శంకుస్థాపన

హైదరాబాద్, వెలుగు: రాజ్యాధికారంలో వాటా, న్యాయమైన హక్కుల సాధనకు మున్నూరు కాపులందరం ఐక్యంగా ముందుకు సాగుదామని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఖైరతాబాద్​ఎమ్మెల్యే దానం నాగేందర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని కోకాపేటలో ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాల స్థలంలో మున్నూరు కాపు ఆత్మగౌరవ భవనానికి ఆదివారం శంకుస్థాపన చేశారు. రాష్ట్ర జనాభాలో మున్నూరు కాపులం గణనీయ సంఖ్యలో ఉన్నామని, తెలంగాణ ప్రాంతంలో పట్వారీలుగా, పోలీస్ పటేళ్లుగా, మాలి పటేళ్లుగా సమాజానికి సేవలందించామని తెలిపారు.

అనాదిగా అగ్రవర్ణ ప్రభుత్వాలు బీసీలను విభజించు–పాలించు అనే ధోరణితోనే చూస్తున్నాయని ఆరోపించారు. కోకాపేటలో నిర్మించే భవనం భవిష్యత్ తరాలకు గొప్ప ఉపాధి సెంటర్ గా మారాలని ఆకాంక్షించారు. మనలో ఐక్యమత్య లోపం వల్లే జనగణనలో మన సంఖ్య చాలా తగ్గించి చూపించారన్నారు. గత ప్రభుత్వం స్థలం మంజూరు చేసిందని, రూ.5 కోట్లు కేటాయించి, విడుదల చేయలేదని ఎమ్మెల్యే నాగేందర్​తెలిపారు.

తాను ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో  మాట్లాడి, రూ.20 కోట్లు కేటాయించాలని కోరానని, ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. త్వరలో మరోసారి ముఖ్యమంత్రిని కలుద్దామని పేర్కొన్నారు. అనంతరం భవన నిర్మాణానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మున్నూరు కాపు సంఘం నాయకులు గాలి అనిల్ కమార్, తూడి ప్రవీణ్ రూ.కోటి చొప్పున ప్రకటించారు. బిల్డర్ పోతురెడ్డి రమేశ్​బాబు, ఆయన కుమారుడు సందీప్ రూ.10 లక్షలు అందజేశారు. కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్ధార్ పుటం పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి పెద్ది, కోశాధికారి కంచి తదితరులు పాల్గొన్నారు.