- సభలో మాట్లాడేందుకు అమిత్‌షాకు ఎందుకంత భయం?
- జులై 20న జరిగిన ఘటనపై యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్
న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్‌లో మోదీ సర్కార్ ప్రవేశపెడుతోన్న బిల్లులన్నీ దేశ ప్రజలు, యువతకు వ్యతిరేకమైనవని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల సభలో ప్రవేశపెట్టిన యూపీఐ బిల్లు ఇదే కోవలోకి వస్తుందని చెప్పారు. జెన్ జీని టార్గెట్ చేస్తూ మోదీ సర్కార్ ఈ బిల్లు తెచ్చిందని ఆరోపించారు. ఒకవేళ యువత ఆందోళనలో పాల్గొంటే.. ఈ చట్టం ద్వారా నిరసనలో పాల్గొన్న వారి డేటాను బ్యాంక్‌ల నుంచి తీసుకొని ఇబ్బందులకు గురి చేయాలనే దురుద్దేశం ఇందులో దాగి ఉందన్నారు. సోమవారం లోక్‌సభ వాయిదా పడిన తర్వాత పార్లమెంట్ ఆవరణలో ఎంపీ వంశీకృష్ణ మీడియాతో మాట్లాడారు.
‘‘మోదీ పాలనలో పరిపాలన నియంత్రణగా మారిపోయింది. ఇదే కేంద్రంలోని ప్రభుత్వ సమస్య. కేంద్ర ప్రభుత్వం సభలో చర్చించి పాలించడం కంటే ఎక్కువగా నియంత్రించడానికి, శిక్షించడానికి ప్రయత్నిస్తోంది. జెన్- జీ, దేశ ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాల గురించి సభలో మాట్లాడాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను డిమాండ్ చేస్తున్నాం. మీకెందుకంత భయం? మా డిమాండ్లపై మీరెందుకని మాట్లాడటం లేదు? మీరు సభకు వచ్చి జులై 20న ఏం జరిగిందో మాట్లాడి... యువతకు, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు.
