- మహిళా ఎంపీలపై పోలీసుల బలప్రయోగం సిగ్గుచేటు
- కేంద్ర ప్రభుత్వంపై ఎంపీ వంశీకృష్ణ ఆగ్రహం
- జ్ఞానేశ్ రాజీనామా చేసే వరకు పోరాటం ఆగదని వార్నింగ్
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య దేశంలో ఓట్ చోరీపై ప్రశ్నిస్తే.. మా మీద లాఠీచార్జ్ చేస్తున్నారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్రంపై ధ్వజమెత్తారు. గురువారం ఢిల్లీలో ఇండియా కూటమి నేతల నిరసన కార్యక్రమంలో ఎంపీలు, ప్రజాప్రతినిధులు, మహిళా ఎంపీలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మహిళా ఎంపీలను కూడా లాఠీలతో కొట్టారని మండిపడ్డారు. ‘బేటీ బచావో’ అంటే ఇదేనా అని ఆయన నిలదీశారు. గురువారం ఉదయం రాజ్ ఘాట్ లో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన అనంతరం లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సహా ఇండియా కూటమి నేతలు శాంతియుతంగా నిరసన తెలిపేందుకు జంతర్ మంతర్‌కు వెళ్తుండగా తమను పోలీసులు అడ్డుకుని లాఠీచార్జ్ చేశారని ఆయన మండిపడ్డారు.
ప్రజాప్రతినిధులపై, మహిళలపై పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. రోడ్డుపై శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిపై, మహిళలపై పోలీసుల బలప్రయోగం సిగ్గుచేటని ఎంపీ మండిపడ్డారు. ఓటు హక్కు, ఎన్నికల ప్రక్రియపై ప్రశ్నలు లేవనెత్తుతున్నందుకే తమపై దాడులు చేయిస్తున్నారని ఎంపీ వంశీకృష్ణ ఆరోపించారు. ‘ కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఇంత భయం? మేము శాంతియుతంగా నిరసన చేస్తుంటే లాఠీలతో కొట్టాల్సిన అవసరం ఏముంది?’ అని ఆయన ప్రశ్నించారు. 13 కోట్ల మంది ఓటర్ల ఓట్లను తొలగించారని, దొంగ ఓట్లు వేశారని తాము ఆరోపిస్తున్నామని పేర్కొన్న ఎంపీ వంశీకృష్ణ.. ఈ అంశాలపై కేంద్రం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు పునాది అని, ఓటు చోరీకి సంబంధించిన ఆరోపణలపై సమగ్రంగా, నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ఎంపీ డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో ఎలాంటి అనుమానాలు లేకుండా ఎన్నికల సంఘం పూర్తి పారదర్శకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.
ఓటు హక్కు పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. అలాగే, సీఈసీకి జడ్ కేటగిరీ భద్రత కల్పించడాన్ని కూడా ఎంపీ వంశీకృష్ణ ప్రశ్నించారు. అతనికి ఎలాంటి భద్రత కల్పించినా తమ నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఓటు హక్కు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఎంపీ స్పష్టం చేశారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. ‘ప్రతి ఓటు విలువైనది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఓటు హక్కును పరిరక్షించాలి. ఓటు చోరీ ఆరోపణలపై వాస్తవాలు వెలుగులోకి వచ్చేలా సమగ్ర విచారణ జరపాలి’ అని ఎంపీ వంశీకృష్ణ అన్నారు.
