- స్థిరమైన ఉత్పత్తితోనే రైతుల యూరియా కష్టాలు తీరుతాయి: ఎంపీ వంశీకృష్ణ
- 13 లక్షల టన్నులు ఉత్పత్తి చేయాల్సిన ప్లాంట్..
- 9 లక్షల టన్నులకే పరిమితమైంది
- రామగుండంలో ఫ్యాక్టరీ ఉంటే.. హెడ్ ఆఫీస్ నోయిడాలో ఉండడం అన్యాయమని వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ (ఆర్ఎఫ్ సీఎల్) పూర్తిస్థాయి సామర్థ్యమే తెలంగాణ రైతులకు స్థిరమైన యూరియా సరఫరాకు మార్గమని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఈ కర్మాగారం బలోపేతం అయితేనే రైతుల కష్టాలు తీరుతాయని స్పష్టం చేశారు. రాబోయే సాగు సీజన్ కోసం అవసరమైన యూరియా కేటాయింపు, రవాణా – సరఫరా అంశాలపై ఫోకస్ చేయాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఢిల్లీలో ఎంపీ వంశీకృష్ణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలని కేంద్రానికి మరోసారి లేఖ రాసినట్లు తెలిపారు.
ఆర్ఎఫ్ సీఎల్ పునరుద్ధరణలో కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్తో నేరుగా మాట్లాడి సుమారు రూ.10 వేల కోట్ల రుణమాఫీ చేయించడం ద్వారా ఈ కంపెనీలో తిరిగి ఉత్పత్తి ప్రారంభమైందన్నారు. అయితే ప్రస్తుతం ఆర్ఎఫ్సీఎల్ ఏడాదికి 13 లక్షల టన్నులు యూరియా ఉత్పత్తి చేయాల్సిన ఈ ప్లాంట్ కేవలం 9 లక్షల టన్నుల వరకు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నదన్నారు. ఇందుకు నిర్వహణ, నిర్లక్ష్యమే కారణాలని తెలిపారు. ఈ అంశంపై ఇప్పటికే ఆర్ఎఫ్ సీఎల్ మేనేజ్మెంట్తో చర్చలు జరిపినట్టు వెల్లడించారు.
హెడ్ ఆఫీస్ నోయిడాలో ఎందుకు?
ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ రామగుండంలో ఉందని, ఆ సంస్థ హెడ్ ఆఫీస్ నోయిడాలో ఉండడం అన్యాయమని ఎంపీ అన్నారు. తక్షణమే హెడ్ ఆఫీసును రామగుండానికి మార్చాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై విషయంపై పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసినా స్పందించడం లేదని ఫైరయ్యారు. ఫ్యాక్టరీ తరచూ షట్‌డౌన్‌లు, రిపేర్లు, సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నదని, దాంతో ఉత్పత్తి తగ్గిపోతున్నదని, ఉద్యోగావకాశాలు ప్రభావితం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అవసరానికి మించిన నిల్వలు ఉన్నాయి: జేపీ నడ్డా
తెలంగాణలో యూరియా కొరత లేదని, అవసరానికి మించి నిల్వలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. లోక్ సభలో ఎంపీ వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు ఆయన మౌఖికంగా సమాధానమిచ్చారు. రాష్ట్రంలో యూరియా అవసరం 4.41 లక్షల టన్నులు (ఎల్‌ఎంటీ) ఉండగా, యూరియా లభ్యత 4.46 ఎల్ఎంటీ ఉందన్నారు. ఇందులో 1.88 ఎల్ఎంటీ విక్రయాలు జరిగాయని, ఇంకా 2.58 లక్షల టన్నుల క్లోజింగ్ స్టాక్ రెడీగా ఉందని పేర్కొన్నారు. అయితే గత రబీ సీజన్ (2024–25)లోనూ 9.80 లక్షల టన్నుల అవసరం ఉండగా, 12.50 లక్షల టన్నులను కేంద్రం సమకూర్చిందన్నారు.

