విచారణకు రాలేను.. సమయం ఇవ్వండి.. సీబీఐకి అవినాష్‌రెడ్డి లేఖ

విచారణకు రాలేను.. సమయం ఇవ్వండి.. సీబీఐకి అవినాష్‌రెడ్డి లేఖ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి నేడు సీబీఐ విచారణకు హాజరుకాలేదు. ఈరోజు  (మే16)  విచారణకు రావాల్సి ఉన్నప్పటికీ, ఆయన హాజరుకాకుండా సీబీఐ అధికారులకు లేఖ రాశారు. షార్ట్‌ నోటీసు ఇచ్చినందున.. విచారణకు మరింత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున రాలేనని చెప్పారు. మరో నాలుగు రోజులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. నాలుగు రోజులు సమయం కావాలి అని సీబీఐకి రాసిన లేఖలో అవినాష్‌ పేర్కొన్నారు.  ఈమేరకు సీబీఐ అధికారులకు లేఖ రాశారు ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి. ఆ తర్వాత హైదరాబాద్‌ నుంచి కడపకు బయల్దేరారు. అయితే, ఎంపీ అవినాష్‌రెడ్డి విజ్ఞప్తిపై ఇప్పటి వరకు సీబీఐ స్పందించలేదు..సీఆర్‌పీసీ 160 సెక్షన్‌ కింద అవినాష్‌కు సోమవారం ( మే15)సీబీఐ నోటీసులు జారీ చేశారు.

వివేకా హత్య కేసులో విచారణకు మంగళవారం (మే 16) ఉదయం 11 గంటలకు సీబీఐ కార్యాలయానికి రావాలని ఎంపీ అవినాశ్ రెడ్డికి ఇచ్చిన నోటీసుల్లో సీబీఐ పేర్కొంది. ఇప్పటికే పలుమార్లు సీబీఐ అధికారులు ఎంపీని విచారించి, స్టేట్ మెంట్ రికార్డు చేశారు. దాదాపు 20 రోజుల విరామం తర్వాత తాజాగా మరోమారు విచారణకు రమ్మంటూ నోటీసులు జారీ చేశారు. మరోవైపు, ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఎంపీ అవినాశ్ దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది.